రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి గ్రామానికి చెందిన టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, రాచర్ల బొప్పాపూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బోడ జగన్ మృతిపట్ల మంత్రి కేటీఆర్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. గత కొంతకాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న జగన్.. హైదరాబాద్‌లోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతి చెందాడు.
విషయం తెలిసిన వెంటనే మంత్రి కేటీఆర్ హుటాహుటిన ఆస్పత్రికి చేరుకుని, జగన్ కుటుంబ సభ్యులను ఓదార్చారు. జగన్ భౌతిక కాయానికి నివాళులర్పించారు. జగన్ భౌతికకాయాన్ని స్వగ్రామం పంపించేందుకు అంబులెన్స్‌ను, ఆయన కుటుంబ సభ్యుల కోసం ప్రత్యేక వాహనాన్ని ఏర్పాటు చేయించారు. వీర్నపల్లికి తన పీఏ మహేందర్ రెడ్డిని కేటీఆర్ పంపించారు. అంత్యక్రియలకు అన్ని ఏర్పాట్లు చేయాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్యను మంత్రి కేటీఆర్ ఆదేశించారు.