తెలంగాణలోని నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న పోలీసు ఉద్యోగాల నియామకాలకు నోటిఫికేషన్ జారీ చేసింది. వీటిలో కానిస్టేబుల్, ఎస్సై పోస్టులు ఉన్నాయి.
పోలీసుశాఖలోని వివిధ విభాగాల్లో వీటిని భర్తీ చేయనున్నారు. 16,027 కానిస్టేబుల్, 587 ఎస్సై, 414 సివిల్ ఎస్సై, 66 ఏఆర్‌ఎస్సై, 5 రిజర్వ్ ఎస్సై, 23 టీఎస్‌ఎస్‌పీ ఎస్సై, 12 ఎస్పీసీఎఫ్ ఎస్సై పోస్టులతో పాటు అగ్నిమాపకశాఖలో 26 ఎస్సై, 8 డిప్యూటీ జైలర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు.
కానిస్టేబుల్ పోస్టుల్లో అత్యధికంగా 5,010 టీఎస్‌ఎస్‌పీ, 4,965 సివిల్, 4,423 ఏఆర్ కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు మే2వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని పోలీసు నియామక మండలి ఛైర్మన్ శ్రీనివాసరావు తెలిపారు. అర్హతలున్న అభ్యర్థులను ఆన్‌లైన్‌లో ఎంపిక చేసి ప్రాథమిక అర్హత పరీక్ష నిర్వహిస్తామని చెప్పారు.