సీపీఎస్రద్దు అంశంపై చర్చించేందుకు ఏపీ ప్రభుత్వం ముగ్గురు మంత్రులు, ప్రభుత్వ సలహాదారు, సీఎస్లతో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు జారీ అయ్యాయి. సీపీఎస్ రద్దు కోరుతూ సీఎంవో ముట్టడికి యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ఆందోళనకు దిగడం.. పలుచోట్ల నిరసనలు తెలిపిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీలో ఆర్థిక మంత్రి బుగ్గన, విద్యాశాఖ మంత్రి బొత్స, పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎస్ సమీర్ శర్మ సభ్యులుగా ఉన్నారు. వివిధ ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో ఈ కమిటీ చర్చించి సీపీఎస్ అంశంపై ప్రభుత్వానికి నివేదిక సమర్పించే అవకాశముంది.
మరోవైపు సీపీఎస్ స్థానంలో గ్యారెంటీ పెన్షన్ స్కీమ్ (జీపీఎస్) పేరిట కొత్త స్కీం తీసుకురావాలని ప్రభుత్వం ప్రతిపాదించినట్లు తెలిసింది. అయితే దీనికి ఉద్యోగ సంఘాల నేతలు అంగీకరించనట్లు సమాచారం. పూర్తిస్థాయిలో అధ్యయనం తర్వాత దీనిపై తమ నిర్ణయం చెబుతామని వెల్లడించినట్లు తెలిసింది.