గత ఎనిమిదేండ్లుగా సంక్షేమాభివృద్ధిలో దేశానికి ఆదర్శంగా నిలిచిన తెలంగాణ రాష్ట్రం తాజాగా వైద్యరంగంలో నెంబర్ వన్ గా నిలవడానికి అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే కరోనా లాంటి మహమ్మారిని కట్టడీలో దేశానికి ఆదర్శంగా నిలిచిన తెలంగాణ వైద్యరంగ చరిత్రలో మరో అద్భుత ఘట్టం రేపు ఆవిష్కారం కాబోతున్నది. కొన్ని దశాబ్దాల తరువాత రాజధాని హైదరాబాద్ నలువైపులా అత్యాధునిక దవాఖానల ఏర్పాటుకు రంగం సిద్ధమైంది.
అల్వాల్ (బొల్లారం), సనత్‌నగర్ (ఎర్రగడ్డ ఛాతి దవాఖాన), ఎల్బీనగర్ (గడ్డి అన్నారం పండ్ల మార్కెట్)లో టిమ్స్ భవనాల నిర్మాణానికి సీఎం కేసీఆర్ రేపు మంగళవారం శంకుస్థాపన చేయనున్నారు. కరోనా మహమ్మారి విజృంభించిన సమయంలో అత్యవసరంగా ఏర్పాటైన గచ్చిబౌలి టిమ్స్‌ను ఆధునీకరించడంతోపాటు మిగతా మూడు టిమ్స్ అవతరించనున్నాయి. సనత్‌నగర్, ఎల్బీనగర్‌లో జీ+14 విధానంలో దవాఖాన భవనాలు నిర్మిస్తారు.అల్వాల్‌లో కంటోన్మెంట్ ప్రాంతం కావడంతోపాటు పక్కనే రాష్ట్రపతి నిలయం ఉండడంతో జీ+5 విధానంలో నిర్మాణం చేపడతారు.
ఒక్కో టిమ్స్‌లో వెయ్యి పడకలు ఉంటాయి. అల్వాల్‌లోని రాజాజీ ఇన్‌స్టిట్యూట్ ప్రాంగణంలో దవాఖాన నిర్మాణ స్థలాన్ని మంత్రులు హరీశ్‌రావు, మల్లారెడ్డి ఆదివారం పరిశీలించారు. రాజీవ్ రహదారికి ఆనుకొని ముత్యాలమ్మ ఆలయం ఎదురుగా ఉన్న 28 ఎకరాల ప్రభుత్వ స్థలంలో ఈ టిమ్స్‌ను నిర్మించనున్నారు. సనత్‌నగర్, ఎల్బీనగర్ టిమ్స్‌ల నిర్మాణ స్థలాలను ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, రాష్ట్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు శర్మన్, అమేయకుమార్ తదితరులు పరిశీలించారు. మూడు టిమ్స్‌ల కోసం ప్రభుత్వం రూ.2,679 కోట్లకు పరిపాలన అనుమతులు మంజూరు చేసిన విషయం తెలిసిందే.