టీడీపీ ప్రభుత్వ హయాంలో మహిళా కమిషన్‌ను తూతూ మంత్రంగా నడిపారని ఏపీ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ విమర్శించారు. విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద అడ్డుకున్న వ్యవహారంలో టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమకు మహిళా కమిషన్ ఛైర్మన్ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. దీనిపై బొండా ఉమ విమర్శలు గుప్పించారు. మహిళా కమిషన్ సుప్రీమా? అంటూ బొండా ఉమ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో వాసిరెడ్డి పద్మ మీడియాతో మాట్లాడారు.
‘‘మహిళలని వేధించే వారికి కమిషన్ సుప్రీమే. ఇలాంటి నేరాలు ఎవరు చేసినా క్షమించేది లేదు. బాధితురాలితో ఎలా వ్యవహరించాలో చంద్రబాబుకు తెలియదని నిన్ననే అర్దమైంది. యుద్దానికి వెళ్తున్నట్టు పెద్ద సంఖ్యలో వచ్చారు. ఏ రాష్ట్రంలోనైనా ఇలా చేస్తున్నారా?.
మనసు, శరీరం గాయం అయిన యువతితో ఎలా వ్యవహరించాలో తెలుసుకోవాలి. అత్యాచార బాధితురాలితో ఎలా మాట్లాడాలో తెలియదా?. అలాంటి వారికి సమన్లు ఇచ్చే అధికారం మహిళా కమిషన్‌కు ఉంది. గతంలో చాలా కేసుల్లో పోలీసు అధికారులకు కూడా ఇచ్చాం. నా హక్కులు నాకు ఉన్నాయి. నేను రాజకీయ నాయకురాలినైతే అప్పుడు వేరేగా ఉండేది. 27న చంద్రబాబు, బోండా ఉమా కమిషన్ ఎదుట హాజరు కావాల్సిందే’’ అని ఆమె స్పష్టం చేశారు.