తెలంగాణకు న్యాయపరంగా రావాల్సిన నిధులు ఇవ్వకుండా బీజేపీ నేతలు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. కేంద్రం ఏదో నిధులు ఇచ్చేస్తున్నట్లు గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో హరీశ్ మాట్లాడారు. తెలంగాణ నిధులతో బిహార్, చత్తీస్‌గఢ్, గుజరాత్ తదితర రాష్ట్రాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారని ఆక్షేపించారు.
బీజేపీ నేతలు ఉల్టా మాటలు కప్పిపెట్టి రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన రూ.7,183కోట్లు వచ్చేలా చేయాలని డిమాండ్ చేశారు. ఈ నిధులపై గతంలో ప్రధాని మోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు సీఎం కేసీఆర్, తాను, ఆర్థిక శాఖ అధికారులు ఎన్నో సార్లు విజ్ఞప్తి చేశామని.. అయినా వారిలో స్పందన లేదని హరీశ్ విమర్శించారు. ఆర్థిక సంఘం సిఫార్సు చేస్తే యథావిధిగా ఇవ్వడం కేంద్రం బాధ్యతని.. కానీ కేంద్రలోని బీజేపీ ప్రభుత్వం ఆ పనిచేయడం లేదన్నారు. జీఎస్టీ సమావేశాలకు వెళ్లినపుడు తాను ఈ అంశాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి వద్ద కూడా ప్రస్తావించినట్లు హరీశ్ గుర్తు చేశారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తన పాదయాత్రలో అబద్ధాలు ప్రచారం చేస్తున్నారన్నారు. పొద్దున లేస్తే టీఆర్‌ఎస్ పార్టీ, సీఎం కేసీఆర్‌ను ఆడిపోసుకోవడం కాకుండా రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన నిధులను రప్పించాలని బండి సంజయ్‌కు ఆయన సవాల్ విసిరారు.