రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడా లంచాలకు అవకాశం లేకుండా నేరుగా లబ్ధిదారులకు మేలు జరిగిందని ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. సంక్షేమ పథకాల ద్వారా 35 నెలల కాలంలో రూ.1,36,694 కోట్లు ప్రజల చేతుల్లో పెట్టామని చెప్పారు. ఒంగోలులో ‘వైఎస్‌ఆర్ సున్నా వడ్డీ’ నిధులు విడుదల చేసిన అనంతరం నిర్వహించిన సభలో సీఎం మాట్లాడారు. ఈ సందర్భంగా చంద్రబాబు సహా ఎల్లో మీడియాపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
కరోనా కష్టకాలంలోనూ తమ ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఆపలేదని సీఎం జగన్ అన్నారు. ప్రజలకు ఇంత మంచి జరుగుతున్నా చంద్రబాబు పాలనే కావాలని దుష్టచతుష్టయం కోరుకుంటోందని విమర్శించారు. చంద్రబాబు, రామోజీరావు, ఏబీఎన్, టీవీ5 దుష్టచతుష్టయమని వ్యాఖ్యానించారు.
ఉచిత పథకాలతో ఆర్థిక వ్యవస్థ విధ్వంసమవుతోందని చంద్రబాబు విమర్శలు చేస్తున్నారని చెప్పారు. ఏపీని మరో శ్రీలంకగా మారుస్తున్నారని ఆరోపిస్తున్నారని.. ఎన్నికల హామీలను చంద్రబాబు తరహా చెత్తబుట్టలో పడేస్తే రాష్ట్రం అమెరికా అవుతుందా? అని జగన్ ఎద్దేవా చేశారు.