మూమూలుగా అయితే కార్లకి, మొబైల్ ఫోన్‌కి ఫ్యాన్సీ నంబర్లు ఉండాలని చాలా మంది కోరుకుంటారు. ఎవరి స్థాయి బట్టి వారు ఖర్చును భరించి తమకు కావాల్సిన నంబర్ల కోసం ప్రయత్నాలు చేసుకుంటారు. ఆటో, బైక్ తదితర చిన్న వాహనాలకు ఫ్యాన్సీ నంబర్ కావాలని ఎవరూ దాదాపుగా పట్టుబట్టరు. కానీ.. చండీగఢ్‌లో ఓ వ్యక్తికి ‘ఫ్యాన్సీ’ కిక్ ఉండటంతో భారీ మొత్తంలో చెల్లించి అనుకున్న నంబర్‌ను సొంతం చేసకున్నాడు. ఇంతకీ ఫ్యాన్సీ నంబర్ ఏ వాహనానికో తెలుసా? కాస్ట్‌లీ కారు కోసమోమో అనుకునేరు.. అలా ఏమీ లేదండీ బాబూ..అది బైక్ కోసం!
హరియాణాలోని చండీగఢ్‌కు చెందిన బ్రిజ్ మోహన్ అనే వ్యాపారికి ఫ్యాన్సీ నంబర్ అంటే మోజు ఎక్కువ. అందుకే తాను రూ.71వేలతో కొనుగోలు చేసిన హోండా యాక్టివాకు ఫ్యాన్సీ నంబర్ కావాలనుకున్నాడు. అక్కడి రవాణాశాఖ అధికారులు 0001 నంబర్‌ను రూ.5లక్షలకు వేలానికి ఉంచారు. దీనికోసం ఎంతో మంది పోటీపడంతో ఆ ధర మరింత పెరిగిపోయింది. అయినా బ్రిజ్ మోహన్ వదిలిపెట్టలేదు. ఆఖరికి రూ.15.44లక్షలకు ఆ నంబర్‌ని దక్కించుకున్నాడు. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.