మల్లాది సందీప్ కుమార్..ఇప్పుడు ఈ పేరు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలో అందరి నోటా వినిపిస్తోంది. నమ్ముకున్న వ్యక్తులకు ఏనాటికైనా మంచి జరుగుతుందన్న నిజం మల్లాది సందీప్ ఎదుగుదలే నిదర్శనం. సామాన్య కార్యకర్తగా రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టి అత్యున్నత స్థాయికి ఎదిగి, చేపట్టిన పదవులకు వన్నె తీసుకొచ్చి, వైఎస్ఆర్‌టీపీలో తన సామర్థ్యం చాటుకొని, స్వశక్తితో అంచలంచెలుగా ఎదిగి ఉన్నతస్థాయికి చేరిన మల్లాది సందీప్‌ను ఇటీవల ఆ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిలమ్మ టీమ్ వైఎస్ఎస్ఆర్ స్టేట్ కో-ఆర్డినేటర్‌గా నియమించడం పట్ల ఆ పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తూ ఆయనకు హార్దిక శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
విశ్వసనీయత పెంచుకున్న షర్మిలమ్మ..
‘వైఎస్ మాదిరిగా ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం, నమ్మిన వారికి న్యాయం చేసే అలవాటు, తాను కష్టాల్లో ఉన్నప్పుడు తనతో ఉన్న వారిని గుర్తుంచుకోవడం, ఎదుటివారు అడగకుండానే మేలు చేసే పెద్ద మనసు ఉన్న నాయకురాలు వైఎస్ షర్మిలమ్మ. వాడుకుని వదిలేసే నైజం టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ నాయకులది. షర్మిలమ్మ ఇందుకు భిన్నంగా ఉంటారు. పార్టీని, తనను నమ్ముకున్న వారికి, గతంలో తాను హామీ ఇచ్చిన వారికి పట్టం కట్టి విశ్వసనీయత పెంచుకున్నారు వైఎస్ తనయ. అదేవిధంగా పార్టీ కోసం పని చేసేవారికి సముచిత గౌరవం ఉంటుందన్న సంకేతాలు పంపించారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పదవుల నియామకాల్లో వైఎస్ షర్మిలమ్మ చేసిన కసరత్తుపై ఆ పార్టీలో హర్షం వ్యక్తమవుతోంది.
విద్యార్థి దశ నుంచే ..
మల్లాది సందీప్ విద్యార్థి దశ నుంచే రాజకీయాలపై ఆసక్తి పెంచుకున్నారు. హైదరాబాద్ నగరంలోని రహమత్ నగర్ కు చెందిన ఈయనకు వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబం అంటే ఎంతో ఇష్టం. మహానేత మరణాంతరం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి దగ్గరయ్యారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో ఉంటూ అధినేత ఆదేశాలతో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని జిల్లాలను సమన్వయం చేస్తూ నూతన కమిటీల ఏర్పాటులో క్రీయశీలంగా వ్యవహరించేవారు. ఆయన పనితీరు మెచ్చిన వైఎస్ జగన్ ఉమ్మడి రాష్ట్రంలో విద్యార్థి విభాగం నాయకుడిగా, యువజన విభాగం నాయకుడిగా, ఐటీ విభాగం కో-ఆర్డినేటర్‌గా నియమించి, ఆయన సేవలను పార్టీ బలోపేతానికి ఉపయోగించుకున్నారు. 2014, 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేసి అధినేత మెప్పు పొందారు. వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్రలో సందీప్ కీలక పాత్ర పోషించారు. ఎప్పటికప్పుడు పాదయాత్ర విశేషాలకు, సమాచారాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తూ తన వంతు సహకారం అందించారు. ఆయన పనితీరును మెచ్చిన వైఎస్ జగన్..ముఖ్యమంత్రి కాగానే ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో స్టేట్ టెక్నికల్ కో-ఆర్డినేటర్ గా నియమించి సముచిత స్థానం కల్పించారు.
షర్మిలమ్మ పిలుపుతో..
వైఎస్ షర్మిలమ్మ తెలంగాణలో పార్టీ పెడుతున్నట్లు..తన వెంట నడవాలని పిలుపునివ్వడంతో సందీప్ అంగీకరించారు. ఆ తరువాత పార్టీ ఆవిర్భావం, పార్టీ బలోపేతం, వైఎస్ షర్మిలమ్మ వ్యక్తిగత సహాయకుడిగా విధులు నిర్వహించి నమ్మకస్తుడిగా పేరు తెచ్చుకున్నారు. నమ్ముకున్న వారికి న్యాయం చేస్తూ వైఎస్ షర్మిలమ్మ తన పార్టీలో సందీప్ ను ప్రోత్సహిస్తున్నారు. టీమ్ వైఎస్ఎస్ఆర్ స్టేట్ కో-ఆర్డినేటర్ గా ఎంపికతో విశ్వసనీయత ఉన్న నాయకురాలినన్న సంకేతాలు వైఎస్ షర్మిలమ్మ పంపించారు. తన వెంట పాదయాత్రలో ఉన్నమల్లాది సందీప్‌కు ఉన్నత పదవి ఇచ్చి గుర్తింపునిచ్చారు. సందీప్‌కు స్టేట్ కో-ఆర్డినేటర్ పదవి ఇవ్వడం పట్ల పార్టీ వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది.
కష్టపడేవారికి సముచిత స్థానం..
కార్యకర్తలే తన సొంత కుటుంబంలా భావించి, వారి బాగోగులు చూడడంలో వైఎస్ఆర్ కుటుంబం ఎప్పుడూ ముందుంటుందని మరోసారి రుజువైంది. పార్టీ ఆవిర్భావం నాటి నుంచి పార్టీనే నమ్ముకుని పని చేస్తున్న వారి ఇంటికే స్వయంగా వెళ్ళి వారి కుటుంబంలో ఒకరిలా కలిసిపోయి యోగక్షేమాలు విచారించే మంచి నాయకురాలిగా వైఎస్ షర్మిలమ్మ నిలిచారు. వైఎస్ షర్మిలమ్మ నేతృత్వంలో కష్టపడి పని చేసే ప్రతి కార్యకర్తకు పార్టీలో సముచిత స్థానం ఉంటుందని చెప్పడానికి మల్లాది సందీప్ నిదర్శనం. కార్యకర్తలను, నాయకులను గుర్తించి సరైన గౌరవం ఇచ్చే నేతలను, పార్టీలను ప్రజలు ఎప్పుడూ ఆదరిస్తూనే ఉంటారు.