తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే ఉచిత విద్య, వైద్యం అందిస్తామంటున్నారని.. కేంద్రంలో అధికారంలో ఉన్నది ఎవరని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా వాటిని అమలు చేస్తామంటే తాము వద్దంటామా? అని ఎద్దేవా చేశారు. ఈనెల 27న టీఆర్‌ఎస్ ప్లీనరీ నిర్వహించనున్న నేపథ్యంలో దానికి సంబంధించిన ఏర్పాట్లపై కేటీఆర్‌సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో హైదరాబాద్ నగర పరిధిలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్యనేతలు పాల్గొన్నారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు.
ఉచిత విద్య, వైద్యంపై బీజేపీకి దమ్ముంటే చట్టం చేసి దేశవ్యాప్తంగా అమలు చేయాలని కేటీఆర్ ఛాలెంజ్ చేశారు. పార్లమెంట్‌లో చట్టం తీసుకొస్తే తాము మద్దతిస్తామని చెప్పారు. రాష్ట్రానికి, పాలమూరు జిల్లాకు ఏం చేశారని బండి సంజయ్ పాదయాత్ర చేస్తున్నారని ప్రశ్నించారు. బీజేపీ పాలిత రాష్ట్రాలకు రూ.వేల కోట్లు ఇచ్చి సహకరిస్తున్నారని.. ఇక్కడ నీతి ఆయోగ్ చెప్పినా ఇవ్వడం లేదనే పాదయాత్ర చేస్తున్నారా? అని కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
టీఆర్‌ఎస్ పాలనపై విమర్శలు చేస్తున్న సంజయ్.. పక్కనే బీజేపీ అధికారంలో ఉన్న కర్ణాటకలో ప్రభుత్వ పనితీరు తెలుసుకోవాలని చురకలంటించారు. అక్కడికి వెళ్లి సిగ్గు తెచ్చుకోవాలన్నారు. బీజేపీ అధికారంలో ఉన్న గుజరాత్‌లో రైతులు విద్యుత్ కోసం రోడ్డెక్కి ధర్నాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. తెలంగాణలో ఆలయాల అభివృద్ధికి ఏనాడైనా కేంద్రం నిధులిచ్చిందా? అని నిలదీశారు. పనికిమాలిన కూతలు మాని ప్రజలకు ఏం చేశారో చెప్పాలని బండి సంజయ్‌ను ఉద్దేశించి కేటీఆర్ అన్నారు.