కొవిడ్ పరిస్థితులతో గత రెండేళ్లుగా నిర్వహించలేకపోయిన టీఆర్‌ఎస్ పార్టీ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఈసారి హైదరాబాద్‌లో నిర్వహించాలని ఆ పార్టీ నిర్ణయించింది. ఏప్రిల్ 27న మాదాపూర్ హెచ్‌ఐసీసీలో ఆ కార్యక్రమాన్ని నిర్వహించాలని టీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఆరోజు ఉదయం 11.05 గంటలకు టీఆర్‌ఎస్ జెండాను ఆవిష్కరిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. అనంతరం అధ్యక్షుడి హోదాలో కేసీఆర్ ప్రసంగించనున్నారు.
అదేరోజు ప్లీనరీ సమావేశాన్ని కూడా నిర్వహించనున్నారు. టీఆర్‌ఎస్ ప్లీనరీకి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, జడ్పీ ఛైర్మన్లు, ఇతర ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలు హాజరుకానున్నారు. ప్లీనరీలో వివిధ తీర్మానాలను ప్రవేశపెట్టి ఆమోదించనున్నారు. వ్యవస్థాపక దినోత్సవం, ప్లీనరీ ఏర్పాట్లపై ఇప్పటికే ఆ పార్టీ నేతలు ఏర్పాట్లు మొదలు పెట్టారు. పార్టీలోని పలువురు ముఖ్యనేతలకు దీనికి సంబంధించిన బాధ్యతలు అప్పగించినట్లు తెలిసింది.