రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా జరిగేలా అధికారులు ఎప్పటికప్పుడు అలెర్ట్‌గా ఉండాలని తెలంగాణ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఆదేశించారు. ధాన్యం కొనుగోలుపై పౌరసరఫరాల శాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. యాసంగి ధాన్యం సేకరణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రక్రియ మొదలు పెట్టిందని చెప్పారు. పక్క రాష్ట్రాల నుంచి ధాన్యం వస్తే కఠినంగా వ్యవహరిస్తామని మంత్రి అన్నారు. అవసరమైతే కేసులు కూడా పెడతామని హెచ్చరించారు.
అంతకుముందు సివిల్ సప్లయిస్ భవన్లో ఎఫ్‌సీఐ రీజినల్ జనరల్ మేనేజర్ దీపక్ శర్మతో మంత్రి సమావేశమయ్యారు. యాసంగి ధాన్యం సేకరణ, కొనుగోలు కేంద్రాల ఏర్పాటు తదితర అంశాలపై జీఎంకు వివరించారు. తెలంగాణలోని ప్రత్యేక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని రైతులన ఇబ్బంది పెట్టొద్దని మంత్రి కోరారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రైతుల కోసం అదనపు భారం భరించి ధాన్యాన్ని సేకరిస్తున్నామన్నారు. కస్టం మిల్లింగ్ సమయంలో అనవసర కొర్రీలతో ఇబ్బందులు పెట్టొద్దని గంగుల కమలాకర్ విజ్ఞప్తి చేశారు.