ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో త్వరలో కొత్త రూల్ తీసుకురానుంది. ఫుడ్ క్వాలిటీపై కస్టమర్ల నుంచి వచ్చే ఫిర్యాదుల ఆధారంగా రెస్టారెంట్లను తనిఖీ చేసి తమ యాప్లో తాత్కాలికంగా బ్యాన్ చేయనుంది. ఈ మేరకు ఇటీవల అన్ని రెస్టారెంట్ల మేనేజ్మెంట్లకు లేఖలు రాసింది. FSSAI ఆధ్వర్యంలోని సంస్థలు తనిఖీ చేసి ఓకే చెప్పిన తర్వాతే బ్యాన్ ఎత్తివేస్తామని.. అంతవరకు ఆయా రెస్టారెంట్లపై నిషేధం కొనసాగుతుందని జొమాటో పేర్కొంది. దీంతో పాటు తనిఖీలకు అయ్యే ఖర్చును కూడా రెస్టారెంట్లే భరించాల్సి ఉంటుందని బాంబు పేల్చింది.
ఈ నేపథ్యంలో జొమాటో నిర్ణయంపై రెస్టారెంట్ల యజమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఒక ఫొటో ఆధారంగా ఫుడ్ క్వాలిటీని ఎలా నిర్ణయిస్తారని ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా తనిఖీలకు అయ్యే ఖర్చును రెస్టారెంట్లే భరించాలంటే ఎలా నిలదీస్తున్నారు. అదే గనక జరిగితే చిన్న రెస్టారెంట్లన్నీ తమ ఉనికిని కోల్పోతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. చాలాసార్లు తప్పుడు ఫిర్యాదులే వస్తుంటాయని ఈ సందర్భంగా చెప్పాయి.
మరోవైపు రెస్టారెంట్ల అసంతృప్తిపై జొమాటో కూడా స్పందించింది. గతంలో ఉన్న ఎక్స్పీరియన్స్ల వల్లే కొత్త రూల్ తీసుకొచ్చామని తెలిపింది. ముందే ప్యాక్ చేసిన ఫుడ్ ఇవ్వడం, వేరే రకమైన మాంసాహారం అందించడం, కుళ్లిన ఆహారం ఇవ్వడం లాంటి సందర్భంగాలను దృష్టిలో ఉంచుకునే ఇలా చేశామని తెలిపింది. ఏదేమైనా ఒకవిధంగా చెప్పాలంటే ఫుడ్ క్వాలిటీ విషయంలో జొమాటో తీసుకుంటున్న ఈ చర్యలు కస్టమర్లకు మాత్రం మేలు చేస్తాయనడంలో సందేహం లేదు.