బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కు పాలమూరులో అడుగుపెట్టే అర్హత లేదని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా తేల్చకుండా జలదోపిడీకి జై కొడతారా? పాలమూరు రైతులకు ద్రోహం చేస్తూ పాదయాత్రలా? అని మండిపడ్డారు. బండి సంజయ్ చేస్తోందని ప్రజా సంగ్రామ యాత్ర కాదని.. ప్రజా వంచన యాత్ర అని తీవ్రస్థాయిలో కేటీఆర్ ధ్వజమెత్తారు. ఈ మేరకు ఆయన బహిరంగ లేఖ రాశారు.
పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఎందుకివ్వలేదని కేటీఆర్ ప్రశ్నించారు. తెలంగాణ అంటే గిట్టని పార్టీ బీజేపీ అని.. కడుపులో ద్వేషం పెట్టుకొని యాత్రలు చేస్తే ఏం లాభముంటుందని నిలదీశారు. బండి సంజయ్ పాదయాత్రకు రైతు ద్రోహ యాత్ర అని పెట్టుకోవాలన్నారు. విభజన హామీలను నెరవేర్చే తెలివి లేదని.. నీతి ఆయోగ్చెప్పినా నిధులిచ్చే నీతి లేదని కేటీఆర్ తీవ్రస్థాయిలో విమర్శించారు.