దళితబంధు నిధులతో ముగ్గురు, నలుగురు కలిసి ఉమ్మడి వ్యాపారం చేసుకుంటే మరింత అభివృద్ధి సాధించవచ్చని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. సిరిసిల్లలో నిర్వహించిన దళితబంధు లబ్ధిదారులకు నిధుల మంజూరు లేఖల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
దళితబంధు నిధులతో ట్రాక్టర్లు, హార్వెస్టర్లే కొంటామంటే వాటి ప్రారంభోత్సవానికి తాను రానని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఆ నిధులతో రాష్ట్రంలో ఎక్కడైనా వ్యాపారం చేసుకోవచ్చని చెప్పారు. రూపాయి పెట్టుబడి పెట్టి రూపాయిన్నర రాబడి గురించి ఆలోచించాలన్నారు. మిగతా వర్గాలకూ దళితబంధు తరహాలో పథకాన్ని అమలు చేస్తామని చెప్పారు. దళితబంధు విజయవంతమైతే ఇతరులకు ఆదర్శంగా నిలుస్తామని కేటీఆర్ అన్నారు.