సాధారణంగా కిలో మామిడి పండ్లు ఎంత రేటు ఉంటాయ్? టేస్ట్, రకాలను బట్టి రూ.70 నుంచి రూ.200 వరకు వాటి ధర ఉండొచ్చు. కానీ మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లోని ఓ పొలంలో పండే మామిడి మాత్రం చాలా స్పెషల్. దేశంలో ఎక్కడా ఆ రకం మామిడి పండ్లు దొరకవు. అందుకే రేటు కూడా అంతే స్థాయిలో ఉంది.
జంబో గ్రీన్ మ్యాంగో’గా పిలిచే ‘తలాల గిర్ కేసర్’ సహా నేపాల్ రకం కేసర్ బాదం, చైనాకు చెందిన ఐవరీ, అమెరికా ఫ్లోరిడాలో పండించే మాంగిఫెరా టామీ ఆట్కిన్స్ వంటి మామిడి రకాలను ఇక్కడ సాగుచేస్తారు. ఈ తోటలోనే కాదు దేశంలోనే అత్యంత ఖరీదైన ప్రత్యేక మామిడి రకం మియాజాకి. వీటి ధర కిలో ఏకంగా రూ.2.70 లక్షలు.
వీటిని సాగు చేస్తున్న రైతు పేరు సంకల్ప్ సింగ్. జబల్‌పూర్‌కు 25 కి.మీ దూరంలోని నానా ఖేదా ప్రాంతంలో ఈ తోట ఉంది. అంతేకాదండోయ్.. అరుదైన రకం మామిడి కావడంతో ఈ తోటకు సెక్యూరిటీ కూడా ఏర్పాటు చేశారు. 24 గంటలూ కాపలా కోసం నలుగురు గార్డులు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. విదేశీ జాతుల కుక్కలను కూడా అక్కడ కాపలా ఉంచారంటే ఆ మామిడి కాయలకు ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఇంతకీ ఎందుకంత డిమాండ్ అని ఆలోచిస్తున్నారా? అక్కడి బ్లాక్ మ్యాంగో చాలా హెల్దీ అని.. మిగతా మామిడి పండ్లలోనూ గ్లూకోజ్,షుగర్ లెవెల్స్ తక్కువగా ఉండటంతో షుగర్ పేషెంట్లు కూడా తీసువచ్చట. అందుకే ఆ మామిడి పండ్లకు అంత డిమాండ్ మరి!