ధాన్యం కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు రానంత మాత్రాన తాము చేతులు ముడుచుకుని కూర్చోబోమని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వమే యాసంగి ధాన్యం మొత్తాన్ని కొనుగోలు చేస్తుందని క్లారిటీ ఇచ్చారు. కేబినెట్ భేటీ ముగిసిన అనంతరం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. యాసంగిలో ప్రతి గింజా తామే కొంటామని చెప్పారు. ఈ మేరకు కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నామన్నారు.
క్వింటాల్‌కు మద్దతు ధర రూ.1,960 చొప్పున రాష్ట్ర ప్రభుత్వమే రైతులకు చెల్లిస్తుందని.. రేపటి నుంచి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ తక్కువ ధరకు ధాన్యాన్ని అమ్ముకోవద్దని కేసీఆర్ సూచించారు. రేపు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ధాన్యం కొనుగోలుపై దిశానిర్దేశం చేస్తామన్నారు.