తెలంగాణ రైతాంగం పండించిన యాసంగి ధాన్యం సేకరణపై ఢిల్లీలోని తెలంగాణ భవన్ వేదికగా టీఆర్ఎస్ పార్టీ చేపట్టిన నిరసన దీక్షలో జాతీయ రైతు ఉద్యమ నాయకుడు రాకేశ్ తికాయత్ పాల్గొని ప్రసంగిస్తూ రైతు వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్న కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
దేశంలో ఏం జరుగుతోందని తికాయత్ ఆగ్రహం వ్యక్తం చేశారు రైతులు మరణిస్తూనే ఉండాలా? అని ప్రశ్నించారు. దేశంలో రైతులు తమ హక్కుల కోసం పోరాడుతూనే ఉంటారు. ధాన్యం కొనాలంటూ తెలంగాణ ప్రభుత్వం ధర్నా చేస్తోంది.
ఒక రాష్ట్ర ప్రభుత్వం ఢిల్లీలో పోరాడడం కేంద్రానికి సిగ్గుచేటు. ధాన్యం కొనుగోలుకు దేశ వ్యాప్తంగా ఒకే విధానం ఉండాలి. ఒకే విధానం లేకపోతే రైతులు రోడ్లపైకి రావాల్సి వస్తుంది. సాగుచట్టాల రద్దు కోసం ఢిల్లీలో 13 నెలల పాటు ఉద్యమించాం. కేంద్రం ఏడాదికి 3 విడతలుగా రైతులకు రూ. 6 వేలు ఇస్తోంది. ఏడాదికి రూ. 6 వేలు ఇస్తూ రైతులను ఉద్ధరిస్తున్నట్లు కేంద్రం మాట్లాడుతోంది అని ఎద్దెవా చేశారు.