తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సీఎం కే చంద్రశేఖర్‌రావు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేశారు. భద్రాచలంలో సీతారాముల కల్యాణ మహోత్సవ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తున్నదని సీఎం తెలిపారు.
‘ధర్మో రక్షతి రక్షితః’ సామాజిక విలువను తూ.చ తప్పకుండా ఆచరించి, ధర్మాన్ని, విలువలను కాపాడేందుకు తన జీవితాన్నే త్యాగం చేసిన మహోన్నత ప్రజాపాలకుడు సీతారామచంద్రుడు అని పేర్కొన్నారు. భారతీయులకు ఇష్ట దైవమని కీర్తించారు.
లోకకల్యాణం కోసం ఎన్నో త్యాగాలకోర్చిన సీతారాముల పవిత్ర భార్యాభర్తల బంధం అజరామరమైనదని, భవిషత్తు తరాలకు ఆదర్శనీయమైనదని వివరించారు. భద్రాచల సీతారాములవారి ఆశీస్సులు సదా రాష్ట్ర ప్రజలకు ఉండాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో జీవనం సాగించేలా దీవించాలని శ్రీసీతారాములను ప్రార్థిస్తున్నట్టు సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.