దేశ రాజధాని నగరం యాసంగిలో పండిన వరి ధాన్యాన్ని కేంద్రం 100% కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ అధికార టీఆర్‌ఎస్ పార్టీ ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో సోమవారం దీక్ష చేపట్టనుంది. దీక్షలో రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ముఖ్యనేతలంతా పాల్గొంటారు. పంటి చికిత్స కోసం ఢిల్లీ వెళ్లి, అక్కడే ఉన్న సీఎం కేసీఆర్ కూడా దీక్షలో పాల్గొంటారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
ధాన్యం కొనుగోలు చేయాలంటూ టీఆర్‌ఎస్ ఈ నెల 4 నుంచి ఆందోళన బాట పట్టిన విషయం తెలిసిందే. కేంద్రంపై మరింత ఒత్తిడి తెచ్చేందుకు ఢిల్లీ వేదికగా నిరసన కార్యక్రమం కూడా తలపెట్టింది. దీక్ష ఏర్పాట్ల కోసం పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు.దీక్షలో పాల్గొనేందుకు ఢిల్లీ రావాలని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్య ప్రజాప్రతినిధులు, డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్లు, కార్పొరేషన్ చైర్మన్లను పార్టీ అధిష్ఠానం ఇప్పటికే ఆదేశించింది.
వీరంతా ఆదివారం సాయంత్రం, సోమవారం ఉదయం హస్తినకు వెళ్లనున్నారు. ఢిల్లీలో దీక్ష తర్వాత కూడా కేంద్రం స్పందించకుంటే తదుపరి కార్యాచరణ ప్రకటించే యోచనలో టీఆర్‌ఎస్ ఉంది. దీక్ష అనంతరం సీఎం కేసీఆర్ హైదరాబాద్ వచ్చాక రాష్ట్ర మంత్రి మండలి సమావేశం నిర్వహించే అవకాశం కనిపిస్తోంది. అందులో ధాన్యం కొనుగోలుపై కీలక నిర్ణయం తీసుకుంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.