తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ సీనియర్ నటుడు.. నిర్మాత మన్నవ బాలయ్య ఈరోజు శనివారం కన్నుమూశారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో పలు విభిన్న పాత్రలల్లో నటించి ప్రేక్షకులలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న బాలయ్య హైదరాబాద్ యూసుఫ్ గూడలోని తన నివాసంలో కన్నుమూశారు. అయితే ఇక్కడ అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే బాలయ్య పుట్టిన రోజు కూడా ఈరోజు కావడం.
1958లో వచ్చిన ఎత్తుకు పై ఎత్తు మూవీతో తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన బాలయ్య దాదాపు మూడు వందలకు పైగా సినిమాల్లో నటించారు. ఒకవైపు నటుడుగానే కాకుండా నిర్మాతగా రచయితగా దర్శకుడిగా పలు విభాగాల్లో పని చేసి తెలుగు సినిమా ఇండస్ట్రీతో తనకంటూ ఒక ముద్ర వేసుకున్నారు. బాలయ్య కథారచయితగా ఊరికిచ్చిన మాట అనే సినిమాకు నంది అవార్డును సొంతం చేసుకున్నారు.
1971లో అమృత అనే బ్యానర్ ను స్థాపించి సూపర్ స్టార్ కృష్ణ,శోభన బాబు,మెగాస్టార్ చిరంజీవి వంటి స్టార్ హీరోల సినిమాలకు నిర్మాతగా వ్యవహరించి దాదాపు పది భారీ సినిమాలను నిర్మించారు. చెల్లెలి దిద్దిన కాపురం మూవీకి నిర్మాతగా నంది అవార్డును దక్కించుకున్నారు.సీనియర్ రెబల్ స్టార్ కృష్ణంరాజు హీరోగా వచ్చి ఘన విజయం సాధించిన నిజం చెబితే నేరమా అనే చిత్రానికి బాలయ్య దర్శకుడిగా పని చేశారు. ఇటీవల ‘మన్మధుడు’ సినిమాలో నాగార్జునకు తాతగారిలా, మల్లీశ్వరీలో కత్రినాకైఫ్‌కు తాతగా, మిత్రుడు సినిమాలో బాలకృష్ణ తాతగా మనకు ఎక్కువగా గుర్తుండిపోయారు. చివరగా వేణు తొట్టెంపూడి హీరోగా నటించిన ‘రామాచారి’ సినిమాలో ముఖ్యమంత్రి పాత్రలో బాలయ్య నటించాడు.