రాష్ట్ర బీజేపీ నేతలు రైతులను రెచ్చగొట్టి వరి వేయించారని.. ఇప్పుడు ధాన్యం కొనమంటే కేంద్ర ప్రభుత్వం నాటకాలు ఆడుతోందని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. యాసంగి ధాన్యం కొనుగోలుకు కేంద్రం సిద్ధంగా లేదని కేసీఆర్ ముందే రైతులకు సూచించారని.. అయినప్పటికీ రైతులను బీజేపీ నేతలు రెచ్చగొట్టారని ఆరోపించారు. ఇది అన్నదాత పోరాటం మాత్రమే కాదని.. తెలంగాణ ఆత్మగౌరవ పోరాటమని పేర్కొన్నారు. ఈ మేరకు ట్విటర్‌లో కేటీఆర్ ఓ వీడియోను పోస్ట్ చేశారు.
‘‘వరి సాగుచేస్తే కేంద్రంతో కొనిపిస్తామని బీజేపీ నేతలు దొంగమాటలు చెప్పారు. బండి సంజయ్, కిషన్‌రెడ్డి ఇప్పుడు కొంటారా ధాన్యం? ధాన్యం కొనుగోలుకు దేశం మొత్తం ఒకే విధానం ఉండాలి. రైతులను ఆగం చేసిన బీజేపీ నేతలను నిలదీద్దాం.. ధాన్యం కొనకపోతే తరిమి కొడదాం’’ అని ఆ వీడియోలో ఉంది. ఈ విషయంలో గతంలో కిషన్‌రెడ్డి, బండి సంజయ్ ఇచ్చిన హామీలను ఆ వీడియోలో ప్రస్తావించారు.