దేశ ప్రజలకు ప్రముఖ వ్యాక్సిన్ తయారీ సంస్థలు గుడ్ న్యూస్ చెప్పాయి. కరోనా నియంత్రణకు సంబంధించిన కొవిషీల్డ్, కొవాగ్జిన్ వ్యాక్సిన్ల ధరలను తగ్గిస్తున్నట్లు ఆయా సంస్థలు ప్రకటించాయి. రేపటి నుంచి 18 ఏళ్లు దాటిన వారందరికీ ప్రికాషన్ డోసు ప్రారంభం కానుంది.
ఈ నేపథ్యంలో ధరలను భారీగా తగ్గించినట్లు తెలుస్తోంది. సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలోని కొవిషీల్డ్ ధర ప్రైవేట్ హాస్పటల్స్‌లో రూ.225 ఉండనున్నట్లు ఆ సంస్థ సీఈవో అదర్ పూనావాలా ప్రకటించారు. మరోవైపు కొవాగ్జిన్ ధర కూడా రూ.225గా నిర్ణయించినట్లు భారత్ బయోటెక్ జేఎండీ సుచిత్ర ఎల్లా వెల్లడించారు. ఇప్పటివరకు కొవిషీల్డ్ ఒక్కో డోసు ధర రూ.600, కొవాగ్జిన్ రూ.1200 ఉండగా ఇకపై రూ.225కే అందుబాటులోకి రానున్నాయి.
అయితే ఈ రేటుకు సర్వీస్ ఛార్జ్ అదనంగా ఉంటుంది. ఒక్కో డోసు ధరపై రూ.150 వరకు మాత్రమే సర్వీ స్ ఛార్జ్ తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్ తయారీ సంస్థలకు సూచించింది. దీంతో ప్రైవేట్ ఆస్పత్రుల్లో కొవిషీల్డ్, కొవాగ్జిన్ వ్యాక్సిన్‌లు సర్వీస్ ఛార్జ్‌తో కలిపి రూ.375గా ఉండనున్నాయి.