ధాన్యం కొనుగోళ్ల అంశం పై ఢిల్లీలో పోరాటానికి సిద్ధమవుతోంది టీఆర్ఎస్ పార్టీ. వరిపోరును ఉధృతం చేసింది టీఆర్ఎస్ పార్టీ. వరుస ఆందోళనలతో హీట్ పుట్టిస్తున్న గులాబీ పార్టీ నేతలు గురువారం తెలంగాణలోని అన్ని జిల్లాకేంద్రాల్లో దీక్షలు చేపట్టింది. టీఆర్ఎస్ దీక్షలతో జిల్లా కేంద్రాలన్నీ హోరెత్తాయి. దీక్షలకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, రైతుబంధు సమితి ఛైర్మన్లు సహా ఇతర ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు భారీగా తరలి వచ్చారు. సిరిసిల్లలోని అంబేడ్కర్ కూడలిలో నిర్వహించిన నిరసన దీక్షలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు.
ధాన్యం కొనుగోళ్ళు నిర్వహించాలని, తెలంగాణలో పండే ప్రతి గింజ కొనాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో నిరసనలకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. శుక్రవారం టీఆర్ఎస్ నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, రైతులు, కార్యకర్తల ఇళ్ళపై నల్లజెండాలు ఎగరేసి నిరసన తెలిపారు.ఏప్రిల్ 11 న ఢిల్లీలోని తెలంగాణ భవన్ వేదికగా టీఆర్ఎస్ ధర్నాకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ ధర్నాకోసం ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి.
భారీ స్టేజ్..ఎండ వేడిని తట్టుకునేలా టెంట్ ఏర్పాటుచేస్తున్నారు టీఆర్ఎస్ నేతలు. దేశ రైతాంగానికి మద్దతుగా గొంతెత్తే నాయకులంటూ కేసీఆర్,కేటీఆర్ ఫ్లెక్సీలు వెలశాయి. ఢిల్లీ నిరసనలో పాల్గొననున్నారు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, రాష్ట్ర మంత్రులు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, ఎంపిలు, జిల్లా అధ్యక్షులు, మున్సిపల్ చైర్మన్ లు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీఆర్ఎస్ ముఖ్యనేతలు ఇందులో పాల్గొంటారు. ఈ ధర్నాలో పలు జాతీయ రైతు సంఘాల నేతలు,వ్యవసాయ సంఘాల నేతలు పాల్గొననున్నారు.