తెలంగాణ ప్రభుత్వాన్ని ఉద్దేశించి గవర్నర్ తమిళిసై చేసిన వ్యాఖ్యలపై మాజీ ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ నాగేశ్వర్ తీవ్రంగా తప్పుబట్టారు. తాను తలచుకుంటే ప్రభుత్వం పడిపోయేదని.. బడ్జెట్ సమావేశాలకు అనుమతివ్వకుండా 15 రోజులు పెండింగ్‌లో పెడితే అసెంబ్లీ రద్దయ్యేదంటూ గవర్నర్ చేసిన వ్యాఖ్యలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు నాగేశ్వర్ ట్వీట్ చేశారు.
కేసీఆర్ ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రజలు ఎన్నుకున్నారని.. ఆయన్ను ఇంటికి పంపడానికి గవర్నర్ ఎవరని నాగేశ్వర్ ప్రశ్నించారు. రాష్ట్రాన్ని పాలించేది ఎవరనేది ప్రజలు నిర్ణయిస్తారని.. కేంద్ర ప్రభుత్వం కాదని చెప్పారు. గవర్నర్‌ను నియమించేది రాష్ట్రపతి అని ఆయన గుర్తు చేశారు. రాష్ట్రానికి వ్యతిరేకంగా నివేదికలు కేంద్ర హోంమంత్రికి ఎలా ఇస్తారని ఆయన ప్రశ్నించారు. గవర్నర్ రాజ్యాంగబద్ధమైన ప్రతినిధి అని.. కేంద్రానికి దూత కాదని నాగేశ్వర్ పేర్కొన్నారు.