తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై గవర్నర్ తమిళసై చేసిన వ్యాఖ్యలను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఖండించారు. నేను తలచుకుంటే అసెంబ్లీ రద్దు అయ్యేది అనే విధంగా తన పరిధి దాటి వ్యాఖ్యలు చేశారని, ఉన్నతమైన హోదాలో ఉన్న వ్యక్తులు అలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని నాటి గవర్నర్ రాంలాల్ కూలదోసిన తర్వాత ఎలాంటి ప్రజాగ్రాహాన్ని చవిచూశారో మనందరికీ తెలిసిందేనన్నారు. గతంలో గవర్నర్ గా ఉన్న నరసింహాన్ గౌరవప్రదంగా వ్యవహరించారని, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆయన్ను అంతే గౌరవించిందని పేర్కొన్నారు.
గవర్నర్ తమిళసై తన గౌరవాన్ని కాపాడుకోవాలని సూచించారు. ప్రోటోకాల్ పాటించలేదని చెప్పడం అర్ధరహితమని, ఎక్కడ ఎవరు ఎలా అవమానించారో చెప్పాలన్నారు. యదాద్రి పర్యటనకు 20 నిమిషాల ముందే రాజ్ భవన్ నుంచి సమాచారం అందిందని, అయినప్పటికీ యదగిరిగుట్ట చైర్మన్ గవర్నర్ తమిళసైకి స్వాగతం పలికారన్నారు. గతంలో బీజేపీ తమిళనాడు శాఖ అధ్యక్షురాలుగా పని చేసిన తమిళిసై బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు.