రాష్ట్ర విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చామని ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. గవర్నమెంట్ స్కూళ్ల రూపురేఖలు మారాయని.. అందుకే విద్యార్థుల చేరికలు పెరుగుతున్నాయని చెప్పారు. నంద్యాలలో ‘జగననన్న వసతి దీవెన’ రెండో విడత కింద విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నగదును జమ చేసిన అనంతరం నిర్వహించిన బహిరంగసభలో సీఎం మాట్లాడారు.
గవర్నమెంట్ స్కూళ్లలో చేరికల కోసం ఎమ్మెల్యేలు రికమెండేషన్ లెటర్‌లు ఇస్తున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవాలన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ కూడా అరకొరగా కాకుండా పూర్తిగా చేస్తున్నామని చెప్పారు. ఒక కుటుంబంలో ఎంత మందిని చదివించినా విద్యార్థుల తాను తోడుగా ఉంటానన్నారు.
ఈ సందర్భంగా ప్రతిపక్షాలు, ఎల్లో మీడియాపై జగన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రజా సంక్షేమం కోసం ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటే ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. చంద్రబాబు, అతని దత్తపుత్రుడు, ఎల్లో మీడియా ఎన్నిరకాలుగా ప్రయత్నించినా తననేమీ చేయలేరన్నారు. రోజుకో వక్రీకరణ, కట్టుకథలతో ప్రభుత్వపై బురదచల్లుతున్నారని ఆరోపించారు. దేవుడి దయ, ప్రజల దీవెనలు ఉన్నంతకాలం తన వెంట్రుక కూడా పీకలేరని జగన్ వ్యాఖ్యానించారు. ప్రజల చల్లని దీవెనలతోనే తాను ఈ స్థానానికి చేరుకున్నానని చెప్పారు.