తెలంగాణ రాష్ట్రంలో రైతాంగం ఆరుగాలం కష్టపడి పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేసే విషయంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా రాష్ట్ర పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు శుక్రవారం నాడు మధిర టౌన్ లో ప్రజాప్రతినిధులు, రైతులు, నాయకులతో కలసి జడ్పీ చైర్మన్, TRS మధిర నియోజకవర్గ ఇంచార్జ్ లింగాల కమల్ రాజు నల్లజెండాలతో భారీ మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అభివృద్ధి, సంక్షేమం లో దేశానికే తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా ఉందని దానిని జీర్ణించుకోలేక కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కారు పెద్దలు తెలంగాణ పై కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రైతాంగానికి ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దపీట వేసి వారికి అన్ని రకాలుగా అండగా ఉంటున్నారని వ్యవసాయాన్ని పండుగగా మార్చి రైతుల ఇళ్లల్లో పండుగ వాతావరణం తీసుకివచ్చారని తెలిపారు తెలంగాణ రాష్ట్రంలో పంటలు బాగా పండి రైతులు ఆనందోత్సాహాలతో ఉంటే కేంద్ర ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు విషయంలో రైతులను ఇబ్బందులకు గురి చేయడం సరికాదన్నారు.
వరి కొనుగోలు బాధ్యత కేంద్రానిదే అని ఆయన గుర్తు చేశారు. ఒక రాష్ట్రంలో మొత్తం వరి ధాన్యం కొనుగోలు చేస్తూ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఆంక్షలు పెట్టి కొనుగోలు చేయకుండా తప్పించుకునే ప్రయత్నాలు చేయడం దుర్మార్గపు చర్య అన్నారు. ఒకే దేశంలో ఒకే కొనుగోలు విధానం ఉండాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమ స్పూర్తితో పోరాడి కేంద్రం చేత వరి ధాన్యం కొనుగోలు చెపిస్తామని తెలిపారు. రైతులను ఇబ్బంది పెడితే భవిష్యత్ లో తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. రాష్ట్రంలో పండిన ప్రతి గింజ కేంద్రం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అప్పటి వరకు తమ పోరాటాన్ని ఉదృతం చేస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, రైతులు, మండల, పట్టణ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.