గవర్నర్ తమిళిసైతో తమకు ఎలాంటి పంచాయతీ లేదని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెండ్, మంత్రి కేటీఆర్ తెలిపారు. సిరిసిల్లలో ఆయన మీడియాతో మాట్లాడుతూ గవర్నర్‌తో వివాదంపై తొలిసారిగా స్పందించారు. గవర్నర్ అంటే తమకు గౌరవం ఉందని.. ఆమెను ఎక్కడా తాము అవమానించలేదని చెప్పారు. ఎక్కడ అవమానం జరిగిందో చెప్పాలన్నారు.
కౌశిక్‌రెడ్డి విషయంలో రాజకీయ నేపథ్యం ఉందని గవర్నర్ ఆయన్ను ఎమ్మెల్సీగా నియమించేందుకు ఆమోదం తెలపలేదని తెలిసిందన్నారు. తనను ఇబ్బంది పెడుతున్నట్లు తమిళిసై వ్యాఖ్యానిస్తున్నారని.. అదంతా అవాస్తవమన్నారు. తనకు తానే అవన్నీ ఊహించుకోకూడదని కేటీఆర్ హితవు పలికారు.
గవర్నర్ గతంలో తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలిగా పనిచేయలేదా? అని ప్రశ్నించారు. ఆమె గవర్నర్ అయ్యేందుకు రాజకీయాలు కావాలని.. ఎమ్మెల్సీ నియామకానికి మాత్రం ఎందుకు అడ్డు అవుతాయని ప్రశ్నించారు.