వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన భవన నిర్మాణం పనులు 18 నెలల్లో పూర్తి కానున్నాయి.రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖకు, నిర్మాణ సంస్థ ఎల్‌అండ్‌టీకి కుదిరిన ఒప్పందం ప్రకారం 2023 సెప్టెంబర్ నాటికి భవన నిర్మాణ పనులను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ దవాఖానను 19 ఎకరాల విస్తీర్ణంలో 27 అంతస్తులతో నిర్మించనున్నారు.
రూ.1,116 కోట్ల వ్యయంతో నిర్మించేందుకు ఎల్ అండీ టీ సంస్థ ఈ నెల 4న అంగీకారపత్రం (లెటర్ ఆఫ్ ఆక్సెప్టెన్సీ) అందుకొన్నది. ఎండాకాలం ముగిసేలోగా మట్టి, ఫుటింగ్ పనులు పూర్తి చేయనున్నారు. ఆ వెంటనే బ్లాక్‌లవారీగా నిర్మాణ పనులను చేపట్టనున్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ దవాఖాన నిర్మాణ బాధ్యతలను రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖకు అప్పగించారు. దీంతో ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఈఎన్సీ గణపతిరెడ్డి పర్యవేక్షణలో టెండర్ల ప్రక్రియను పూర్తి చేసి, నిర్మాణ బాధ్యతలను ఎల్‌అండ్‌టీకి అప్పగించారు. మెట్రోరైల్ లాంటి అనేక భారీ ప్రాజెక్టులను చేపట్టిన అనుభవం ఉన్న ఎల్‌అండ్‌టీ సకాలంలో నిర్మాణం పూర్తి చేయగలదన్న విశ్వాసం వ్యక్తమవుతున్నది.