రామ్‌గోపాల్ వర్మ.. వివాదాస్పద అంశాలతో తరచూ వార్తల్లో నిలిచే ప్రముఖ దర్శకుడు. ఆయన తన మాటలతోనే కాకుండా తన సినిమాతోనూ కాంట్రవర్సీకి దగ్గరవుతుంటారు. లేటెస్ట్‌గా ‘డేంజరస్’ పేరుతో ఓ మూవీని రూపొందించారు. అది తెలుగులో ‘మా ఇష్టం’ పేరుతో ఈనెల 8న రిలీజ్ కానుంది. ఈ సినిమాలో లెస్బియన్స్‌గా అప్సరరాణి, నైనా గంగూలీ నటించారు. ఈ నేపథ్యంలో రామ్‌గోపాల్ వర్మ మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర అంశాలను పంచుకున్నారు.
తన దర్శకత్వంలో పెద్ద బడ్జెట్ సినిమాలు వస్తాయని అస్సలు ఊహించవద్దని ఆయన చెప్పారు. ఆ సినిమాలకు ఫ్యామిలీ ఆడియన్స్ వస్తుంటారని.. అలాంటివి తీయడం తనకు చేతకాదని తేల్చి చెప్పేశారు. ‘మా ఇష్టం’ క్రైమ్ డ్రామాతో కూడిన మూవీ అని.. ఇద్దరు అమ్మాయిలో ఓ క్రైమ్‌లో చిక్కుకున్న సమయంలో వారి మధ్య ప్రేమ ఎలా పుట్టిందనే అంశాన్ని ఇందులో చూపిస్తున్నామని వర్మ తెలిపారు.
లెస్బియన్స్ పాత్రల్లో అప్సర రాణి, నైనా గంగూలీ అద్భుతంగా నటించారని చెప్పారు. సినిమాలు కాంట్రవర్సీ అయితే తాను పట్టించుకోనని.. తనకు నచ్చినట్లే తనకోసమే సినిమా తీసుకుంటారని కుండబద్దలు కొట్టినట్లు తెలిపారు. తన సినిమా నచ్చకపోతే ఎవరూ చూడొద్దని.. తాను కూడా ఎవర్ని ఇబ్బంది పెట్టనని ఎలాంటి మొహమాటం లేకుండా తనదైన శైలిలో చెప్పేశారు వర్మ.