అమ్మవారి గుడిలో చోరీకి వెళ్లిన దొంగ అక్కడే ఇరుక్కుపోయాడు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కంచిలి మండలం జాడుపూడి గ్రామంలో జామి ఎల్లమ్మ గుడి ఉంది. కంచిలి పట్టణానికి చెందిన పాపారావు అనే యువకుడు ఈ తెల్లవారిజామున దొంగతనానికి గుడి వద్దకు వెళ్లారు. గుడిలో ఓ కిటికీ నుంచి లోనికి ప్రవేశించాడు. అమ్మవారి వెండి వస్తువులు తీసుకుని తిరిగి అదే కిటికీ నుంచి బయటకు వచ్చేందుకు ప్రయత్నించాడు.
సరిగ్గా అక్కడే దొంగ ప్లాన్ రివర్స్ అయింది. బయటకు వచ్చే సమయంలో కిటికీలో దొంగ ఇరుక్కుపోయాడు. అటు లోనికి వెళ్లలేక ఇటు బయటకు రాలేక తీవ్ర అవస్థలు పడ్డాడు. కాసేపటి తర్వాత అటువైపు వెళ్తున్న కొందరు యువకులు దొంగను గమనించి దేహశుద్ధి చేసి కిటికీ నుంచి బయటకు తీశారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.