ఆహార ధాన్యాల సేకరణపై చర్చ చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపీల నినాదాలతో ఉభయ సభలు హోరెత్తాయి. టీఆర్ఎస్ ఎంపీలు ప్లకార్డులు ప్రదర్శిస్తూ కేంద్రం తీరును ప్రశ్నించారు. ప్రశ్నోత్తరాల సమయంలో ఎంపీలు స్పీకర్ పోడియం ముందు ఆందోళన చేపట్టారు.అమాయకులైన అన్నదాతలను రక్షించండి.. అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలకు అన్యాయం చేయకండి.. వరి కొనుగోళ్ల కోసం నిర్ధిష్టమైన విధానాన్ని ప్రకటించండి.. అంటూ ప్లకార్డులను ప్రదర్శించారు. టిఆర్ఎస్ ఎంపీల నినాదాలతో ఉభయసభలు దద్దరిల్లాయి. ఆహార ధాన్యాల సేకరణపై జాతీయ విధానం రూపొందించాలని టీఆర్ఎస్ ఎంపీలు డిమాండ్ చేశారు.
టీఆర్ఎస్ ఎంపీల ఆందోళన నేపథ్యంలో స్పీకర్ బిర్లా సభను వాయిదా వేశారు. సభ తిరిగి ప్రారంభమైన తర్వాత కూాడా ఎంపీలు తమ పోరాటాన్ని కొనసాగించారు. కేంద్రం మొండివైఖరికి నిరసనగా సభ నుంచి వాకౌట్ చేసి పార్లమెంట్ ప్రాంగణంలోని గాంధీ విగ్రహాం ముందు నిరసన చేపట్టారు.ఇవాళ ఉదయం స్పీకర్ ఓం బిర్లాకు లోక్ సభలో టీఆర్ఎస్ పక్ష నేత నామ నాగేశ్వరరావు, రాజ్యసభలో సురేష్ రెడ్డి వాయిదా తీర్మానం నోటీసులు ఇచ్చారు. రాష్ట్రంలో పండిన పంట కేంద్ర ప్రభుత్వ ఆహార సంస్థ ఎఫ్‌సీఐ సేకరణ చేయకపోవడంతో రైతులు పడుతున్న ఇబ్బందులపై చర్చించాలని వారు స్పీకర్లను కోరారు.
పారా బాయిల్డ్ రైస్ అంశంపై ఇచ్చిన వాయిదా తీర్మానంపై చర్చించాలని సభలో ఎంపీలు పట్టుబట్టారు. ఇది చాలా ముఖ్యమైన అంశమని, ఒడిశా తో పాటు మరికొన్ని రాష్ట్రాలు ఇబ్బందులు పడుతున్నాయని స్పీకర్ దృష్టికి తీసుకొచ్చారు. ఆహార ధాన్యాల సేకరణపై జాతీయ విధానంపై సభలో చర్చించాలన్నారు. ఈ విషయం చాలా ముఖ్యమైనదని, ఈ రోజు కార్యక్రమాలు రద్దు చేసి… ఈ అంశంపై చర్చించాలని టీఆర్ఎస్ ఎంపీలు డిమాండ్ చేశారు.