జీనోమ్ వ్యాలీలో జాంప్ ఫార్మాను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జాంప్ ఫార్మాలో కేటీఆర్ మొక్క నాటారు. అనంతరం నిర్వహించిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు.తెలంగాణలో రూ. 250 కోట్లతో జాంప్ ఫార్మాను నెలకొల్పడం సంతోషకరమన్నారు. 200 మందికి జాంప్ ఫార్మా ద్వారా ఉపాధి లభిస్తుందన్నారు. గుజరాత్ పారిశ్రామికవేత్తలు తమకు అహ్మదాబాద్ కంటే హైదరాబాదే ఎక్కువ ఇష్టం అంటున్నారని చెప్పారు.
జీనోమ్ వ్యాలీ ఆకర్షణీయమైన పెట్టుబడుల కేంద్రంగా మారిందని, సీఎం కేసీఆర్ పరిశ్రమలకు అద్భుతమైన సహకారాన్ని అందిస్తున్నారన్నారు. 50 బిలియన్ డాలర్లుగా ఉన్న జీనోమ్ వ్యాలీ పెట్టుబడులు.. 2030 కల్లా 100 బిలియన్లకు చేరడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు చెప్పారు.గ్లోబల్ వ్యాక్సిన్ ఉత్పత్తుల్లో హైదరాబాద్ వాటా 33 శాతం అని, జీనోమ్ వ్యాలీ.. బీ హబ్ గా మారబోతోందన్నారు. అనేక ప్రతిష్టాత్మక ఫార్మా కంపెనీలు జీనోమ్ వ్యాలీలో ఉన్నాయని మంత్రి గుర్తు చేశారు.
జీనోమ్ వ్యాలీ కి అనుసంధానంగా కంటోన్మెంట్ ద్వారా రోడ్ల నిర్మాణానికి అనుమతులను అడుగుతున్నామన్నారు. 6-7 ఏళ్లుగా కేంద్రం మా ప్రతిపాదనలను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. కేంద్రం బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదని అసహనం వ్యక్తం చేశారు. జీనోమ్ వ్యాలీకి దగ్గరలో 5 స్టార్ హోటల్స్ కూడా త్వరలోనే రానున్నాయని మంత్రి కేటీఆర్ చెప్పారు.
28 రోజుల్లోనే జాంప్ ఫార్మాకు ల్యాండ్
జాంప్ ఫార్మా గ్రూప్ సీనియర్ వైస్ చైర్మన్ సుకంద్ జునేజా మాట్లాడుతూ.. 4 ఏళ్ల క్రితం జాంప్ ఫార్మా గ్రూప్ ఏర్పాటు చేశామన్నారు. ఇండియాలోనూ మా గ్రూప్ ను విస్తరించాలనుకున్నప్పుడు.. చాలా స్టేట్స్ ఆప్షన్ గా ఉన్నా.. తెలంగాణలోనే ఏర్పాటు చేశామని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం పరిశ్రమలకు అద్భుతమైన సహకారాన్ని అందిస్తోందని, 28 రోజుల్లోనే జాంప్ ఫార్మాకు ల్యాండ్ కేటాయించారన్నారు.