ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కోసం తెలంగాణ ప్రభుత్వ అన్ని చర్యలు చేపడుతోందని రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్) అన్నారు. టీఎస్ ఐపాస్ ద్వారా దీనికి సంబంధించిన చర్యలు తీసుకుంటున్నామని.. 15 రోజుల్లోనే కంపెనీలకు పర్మిషన్లు ఇస్తున్నామని చెప్పారు. హైదరాబాద్ శివారు మహేశ్వరంలోని ఈ-సిటీలో విప్రో సంస్థ నూతన పరిశ్రమను ఆ సంస్థ వ్యవస్థాపకుడు అజీమ్ ప్రేమ్‌తో కలిసి కేటీఆర్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుమారు రూ.300 కోట్లతో విప్రో కంపెనీని ఏర్పాటు చేశారని.. పొల్యూషన్ బయటకు విడుదల కాకుండా జర్మన్ సాంకేతికతను ఉపయోగిస్తూ అన్ని చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో కొత్త పరిశ్రమలకు రాయితీలు, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కల్పిస్తున్నామని తెలిపారు. టీఎస్ ఐపాస్ ద్వారా రాష్ట్రంలో ఇప్పటివరకు రూ.2.2లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని.. ఈ ఏడేళ్లలో 16లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించామని కేటీఆర్ వివరించారు.
అజీమ్ ప్రేమ్‌జీ జీవితం అందరికీ ఆదర్శం
ఈ సందర్భంగా అజీమ్ ప్రేమ్‌జీ సేవలను కేటీఆర్ కొనియాడారు. ‘‘అజీమ్ ప్రేమ్‌జీలాంటి వ్యక్తి మన మధ్య ఉండటం గొప్ప విషయం. ఆయన జీవితం అందరికీ మంచి పాఠంలాంటిది. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే తత్వం అందరికీ ఆదర్శం. కరోనా సమయంలో అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్ ద్వారా చాలా సేవా కార్యక్రమాలు చేపట్టారు’’ అని కేటీఆర్ గుర్తు చేశారు. అనంతరం అజీమ్ ప్రేమ్‌జీ మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం పెట్టుబడిదారులకు ప్రొత్సాహకంగా ఉందని.. రాష్ట్రంలో నిరంతరాయంగా పెట్టుబడులు పెట్టి ఉద్యోగాలు కల్పించాలనుకుంటున్నట్లు చెప్పారు. ఎల్‌ఈడీ పరిశ్రమతో పాటు ప్రైవేటు యూనివర్సిటీని కూడా తెలంగాణలో ఏర్పాటు చేయాలని అజీమ్ ప్రేమ్‌జీని ఈ సందర్భంగా కేటీఆర్ కోరారు.