ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. ప్రధానమంత్రి నరేంద్రమోడీతో సీఎం జగన్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో సోమవారం నుంచి ప్రారంభించిన కొత్త జిల్లాలు, ఇతర అంశాలపై ప్రధానితో సీఎం మాట్లాడినట్లు తెలిసింది. దీంతో పాటు రాష్ట్రానికి ప్రత్యేకహోదా, విభజన హామీల అమలు, పోలవరం నిధులు, రెవెన్యూ లోటు భర్తీ తదితర అంశాలపై మోడీతో జగన్ చర్చించినట్లు సమాచారం. పోలవరం సవరించిన అంచనాలకు ఆమోదం తదితర అంశాలపై మోడీ దృష్టికి సీఎం తీసుకెళ్లారు. వీళ్లద్దరి భేటీ గంటకు పైగా కొనసాగింది.
ఈ ఏడాది జనవరిలో ప్రధానితో సమావేశమైనపుడు చర్చించిన అంశాలు, వాటి పురోగతిపై జగన్ అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. దీంతో పాటు రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు, దానికి సంబంధించిన ఇతర అంశాలు ప్రధాని, సీఎం మధ్య చర్చకు వచ్చినట్లు తెలిసింది.