తెలంగాణలో యాసంగి ధాన్యం కొనుగోలు అంశంపై కేంద్రప్రభుత్వంపై మరింత గట్టిగా ఫైట్ చేయాలని టీఆర్‌ఎస్ పార్టీ నిర్ణయించింది. దీనికి సంబంధించిన యాక్షన్ ప్లాన్‌ను టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ప్రకటించారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్ ఆయన మాట్లాడారు. ధాన్యం కొనుగోలు అంశంలో బీజేపీ నేతలు ఢిల్లీలో ఒకలా.. గల్లీలో మరొకలా మాట్లాడుతున్నారని విమర్శించారు.
కేంద్ర ప్రభుత్వం ఆనవాయితీగా బియ్యాన్ని కొనుగోలు చేస్తోందని కేటీఆర్ చెప్పారు. ఈ యాసంగిలో రా రైస్ అయినా, బాయిల్డ్ రైస్ అయినా కేంద్ర ప్రభుత్వమే కొంటుందని కేంద్రమంత్రిగా ఉన్న కిషన్‌రెడ్డి చెప్పారన్నారు. రైతులను కన్ఫ్యూజ్ చేయొద్దని.. యాసంగి ధాన్యం కొంటారా? లేదా? అని నిలదీశారు. పెద్ద మనసుతో ఆహార భద్రత చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశామని.. కానీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతుల బాధలను అర్థం చేసుకోవట్లేదనే విషయం తమకు అర్థమైందన్నారు. కార్పొరేట్లకు మాత్రమే కేంద్ర ప్రభుత్వం సహకరిస్తోందని ఆరోపించారు.
కేంద్ర ప్రభుత్వ విధానాలకు నిరసనగా గ్రామస్థాయి నుంచి టీఆర్‌ఎస్ నిరసన కార్యక్రమాలు చేపడుతుందని కేటీఆర్ వివరించారు. ఈనెల 4న అన్ని మండల కేంద్రాల్లో నిరసన దీక్షలు, 6న ముంబయి, నాగ్‌పుర్, బెంగుళూరు, విజయవాడ హైవేలపై రాస్తారోకో, 7న హైదరాబాద్ మినహా 32 జిల్లా కేంద్రాల్లో నిరసన, 8న రాష్ట్రంలని అన్ని పంచాయతీల్లో రైతుల నిరసన.. ర్యాలీలు, కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనాలు, 11న ఢిల్లీలో తెరాస మంత్రులు, ప్రజాప్రతినిధుల నిరసనలు ఉంటాయని తెలిపారు. ఈ నిరసన కార్యక్రమాలను విజయవంతం చేయాలని టీఆర్‌ఎస్ శ్రేణులకు కేటీఆర్ పిలుపునిచ్చారు. దేశం మొత్తం ఒకటే పాలసీ ఉండాలని కేటీఆర్ అన్నారు. వన్‌నేషన్.. వన్‌రేషన్ అంటున్నారని.. వన్ నేషన్.. వన్ ప్రొక్యూర్‌మెంట్ ఎందుకు ఉండదని ఆయన దుయ్యబట్టారు.