తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పేరుతోనే శుభాలను మోసుకొస్తున్న ‘శుభకృత్’నామ సంవత్సరం, ప్రజలకు అన్ని రంగాల్లో శుభాలను చేకూర్చనున్నదని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలియజేశారు. తెలంగాణ ప్రభుత్వ కృషి, దైవకృపతో పుషలమైన నీరు, పచ్చని పంటపొలాలతో తెలంగాణ అలరారుతున్నదని ఆనందం వ్యక్తం చేశారు.
అనతికాలంలోనే అన్ని రంగాలను పటిష్ట పరుచుకున్నామని, ‘శుభకృత్’ నామ సంవత్సరంలో తెలంగాణ మరింత గొప్పగా అభివృద్ధి సాధించనున్నదని ఆయన అన్నారు. అభివృద్ధిలో దేశానికి తెలంగాణ దిక్సూచిగా మారిందని తెలిపారు. తెలంగాణ ప్రజలకు ఉగాది నుండే నూతన సంవత్సరం ఆరంభమవుతుందని, తమ వ్యవసాయ పనులను రైతన్నలు ఉగాది నుండే ప్రారంభిస్తారని పేర్కొన్నారు.
తెలంగాణ ప్రభుత్వం సాగునీరు, వ్యవసాయ రంగాలకు అత్యధికంగా ప్రోత్సాహాన్ని అందిస్తున్నదని తెలిపారు. దేశంలో రైతన్నల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రమేనని అన్నారు. వ్యవసాయ రంగంలో తెలంగాణ అనతి కాలంలోనే దేశం గర్వించేలా కనీవినీ ఎరుగని అభివృద్ధిని సాధించిందని సీఎం అన్నారు. వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడం ద్వారా అనుబంధ వృత్తులు బలపడి తెలంగాణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టమైందని తెలిపారు. వ్యవసాయం బాగుంటేనే సర్వజనులు సంతోషంగా ఉంటారనే సూక్తిని తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్నదని అన్నారు.