దేశంలో రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాలన్నింటిలో తెలంగాణ విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాలు అత్యధిక ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ (పీఎల్‌ఎఫ్)తో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచాయి. టీఎస్ జెన్కో ఆధ్వర్యంలోని తెలంగాణ విద్యుత్తు సంస్థలు 2021-22 ఆర్థిక సంవత్సరంలో 73.87% పీఎల్‌ఎఫ్‌ను నమోదు చేశాయి.
పశ్చిమ బెంగాల్‌లోని విద్యుత్తు సంస్థలు 72% పీఎల్‌ఎఫ్‌తో రెండో స్థానంలో నిలిచాయి. దేశంలోని 800 మెగావాట్ల సూపర్ క్రిటికల్ యూనిట్లలో చూసుకొంటే.. మన కేటీపీఎస్ ఏడో దశ ఏకంగా 83.56% పీఎల్‌ఎఫ్‌తో టాప్‌లో నిలిచింది.
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్టీపీసీ) 70% పీఎల్‌ఎఫ్‌ను మాత్రమే సాధించింది. ఎన్టీపీసీతోపాటు కేంద్రం పరిధిలోని ఇతర విద్యుత్తు కేంద్రాలన్నింటిలో కలిపి కేవలం 69% పీఎల్‌ఎఫ్ నమోదవగా.. దేశ సగటు పీఎల్‌ఎఫ్ 58 శాతంగా నమోదైంది.