షెడ్యూల్డ్ కులాల వర్గీకరణపై చర్చించాలని పార్లమెంటు ఉభయసభల్లో టీఆర్‌ఎస్ పార్టీ వాయిదా తీర్మానం ఇచ్చింది. షెడ్యూల్డ్ కులాల వర్గీకరణ చాలా ఏండ్లుగా పెండింగ్‌లో ఉన్నదని, ఉభయ సభల్లో కార్యకలాపాలు సస్పెండ్ చేసి ఈ అంశంపై చర్చించాలని వాయిదా తీర్మానంలో లోక్‌సభలో టీఆర్‌ఎస్ పార్టీ పక్ష నేత నామా నాగేశ్వరరావు కోరారు.
ఇదే అంశంపై రాజ్యసభలో టీఆర్ఎస్ నేత కే కేశవరావు నోటీసులు ఇచ్చారు.వర్గీకరణతో వారి జనాభా ప్రకారం చట్టబద్ధమైన ప్రయోజనాలు అందేలా, వెనుకబాటుదనాన్ని దూరం చేసేందుకు రాజ్యాంగ సవరణ తీసుకురావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.
కాగా, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తెలంగాణ వ్యతిరేక విధానాలపై పార్లమెంటు ఉభయ సభల్లో టీఆర్‌ఎస్ ఎంపీలు పోరాడుతున్న విషయం తెలిసిందే.గత కొన్ని రోజులుగా పెరుగుతున్న చమురు ధరలపై కాంగ్రెస్ ఎంపీ యానికం ఠాగోర్ వాయిదా తీర్మానం ఇచ్చారు.