మానవ దైనందిన జీవితంతో పెనవేసుకుపోయిన అత్యంత కీలక అంశం విద్యుత్తు. కరెంటు సరఫరాలో చిన్న అంతరాయం ఏర్పడినా జన ప్రవాహం ఎక్కడికక్కడ స్తంభించిపోయేంతగా విద్యుత్ అవసరాలు పెరిగిపోయాయి. అంతటి ప్రాధాన్యం గల విద్యుత్తు ఉమ్మడి పాలనలో తెలంగాణ ప్రాంత ప్రజల, రైతుల జీవితాలను అతలాకుతలం చేసింది.రెండు, మూడు విడుతల 6 గంటల విద్యుత్తుతో నాడు వ్యవసాయరంగం సంక్షోభంలోకి నెట్టివేయబడింది. గృహ, వాణిజ్య వినియోగదారులు గంటల తరబడి అంధకారంలో జీవించారు. 2, 3 రోజుల పవర్ హాలిడేలతో పారిశ్రామికరంగం మూతపడే స్థాయి కి చేరుకున్నది. ఇలాంటి పరిస్థితుల్లో కలలుగన్న ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది. తెలంగాణ వస్తే చిమ్మచీకట్లు రాజ్యమేలుతాయనే హెచ్చరికలు చేసిన నాయకుల కండ్లు జిగేల్‌మనేలా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వల్ప వ్యవధిలో అన్నిరంగాలకు 24 గంటల నిరంతర ఉచిత, నాణ్యమైన విద్యుత్‌ను అందిస్తున్నారు. కొత్త రాష్ట్రమైన తెలంగాణ అతి తక్కువకాలంలో అత్యున్నత శిఖరాలకు చేరుకొని విద్యుత్ రంగంలో అద్భుతమైన ప్రగతిని సాధించింది. దీన్ని ‘డ్రీమ్స్ కం ట్రూ’ (కలల సాకారం)గా అభివర్ణించవచ్చు.
రాష్ట్ర ప్రభుత్వం గత ఐదేండ్లలో మొదటిసారి స్వలంగా కరెంటు చార్జీలను పెంచింది. ఒక్కసారి, దేశవ్యాప్తంగా విద్యుత్ చార్జీలు ఎలా ఉన్నాయి, పెంపుదల ఏ విధంగా ఉన్నదో చర్చించుకుందాం. విద్యుత్ చార్జీలను ప్రధానంగా ఉత్పత్తి వ్యయం, సరఫరా, పంపిణీ వ్యయాలు ప్రభావితం చేస్తాయి. 2014-2015లో టన్ను బొగ్గుకు రూ.50గా ఉన్న క్లీన్ ఎనర్జీ సెస్ ప్రస్తుతం రూ.400లకు పెరిగింది. అదేవిధంగా గత ఐదారేండ్లలో రెట్టింపైన చమురు, గ్యాస్ ధరల వల్ల బొగ్గు రవాణా, రైల్వే రవాణా చార్జీలు కూడా పెరిగాయి. మొత్తంగా విద్యుత్ ఉత్పత్తి వ్యయం భారీగా పెరిగింది. అదేవిధంగా విద్యుత్ సంస్థలకు రాష్ట్రం ఇచ్చే సబ్సిడీ తప్ప కేంద్రం నుంచి ఎలాంటి ఆర్థిక సహాయం అందదు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత విద్యుత్ సబ్‌స్టేషన్లు, లైన్లు, పంపిణీ సామర్థ్యం, 7,500 మెగావాట్ల నుంచి సుమారు 25,000 మెగావాట్లకు ఉత్పత్తికి పెంచుకున్నాం. అందుకోసమే సంస్థలు రూ.35 వేల కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను బలోపేతం చేసుకున్నా యి. కేంద్రసంస్థలైన పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, ఆర్‌ఈసీలు రుణాలను, 12 శాతం మేర వడ్డీకి ఇస్తాయి. ఈ వడ్డీ శాతం వ్యక్తిగత రుణాలపై బ్యాంకులు విధించే వడ్డీ శాతం కన్నా ఎక్కువ. అంతేకాకుండా ఇంటర్‌స్టేట్ ట్రాన్స్‌మిషన్ సిస్టం కింద పీజీసీఎల్‌కు రూ.1580 కోట్లు చెల్లించాలి.
పైన పేర్కొన్న పరిస్థితుల్లో విద్యుత్ సంస్థలు 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన అంచనాలను రాష్ట్ర విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్‌కు సమర్పించి 18 శాతం చార్జీల పెంపుదలను అడిగాయి. రాబోయే ఏడాదిలో 74,727 మిలియన్ యూనిట్ల కొనుగోలు, రూ.53,054 కోట్ల రెవెన్యూ అవసరాలను అంచనా వేశాయి. కమిషన్ రూ.48,708 కోట్ల అవసరాలకు అనుమతినిస్తూ రూ.6,831 కోట్ల చార్జీల పెంపుదల ప్రతిపాదనలకు గాను రూ.5,596 కోట్ల పెంపుదలకు అనుమతినిచ్చింది.
యూనిట్ రేటు (Cost of Service) వినియోగదారుడికి చేరేసరికి రూ.7.24పై అవుతున్నది. 200 యూనిట్లలోపు వాడుకునే పేద, మధ్య తరగతి వినియోగదారుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏటా రూ.1253 కోట్ల సబ్సిడీ భరిస్తున్నది. 101 యూనిట్లలోపు వాడుకునే ఎస్సీ, ఎస్టీ వినియోగదారులకు ఉచిత విద్యుత్‌ను అందిస్తున్నది. క్షౌర, రజ కవృత్తుల వారికి 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను, పౌల్ట్రీ, టెక్స్‌టైల్ రంగాల వారికి రూ.2 సబ్సిడీని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తున్నది. వ్యవసాయ, ఇతర అన్నిరంగాలకు కలిపి క్రాస్ సబ్సిడీ, సబ్సిడీగా రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ సంస్థలకు ఈ ఆర్థిక సంవత్సరం రూ.13,100 కోట్లు చెల్లిస్తున్నది. అయినా రోజువారీ లెక్కన కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను సవరిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఐదేండ్ల తర్వాత తెలంగాణలో పెరుగుతున్న స్వల్ప విద్యుత్ చార్జీలను కొందరు నాయకులు పనిగట్టుకొని విమర్శించడం గర్హనీయం.
మానవాళి ఊహించని కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక, సామాజిక పరిస్థితులను తీవ్ర ప్రభావితం చేసింది. ఇంతటి విపత్కర పరిస్థితుల్లోనూ రాష్ట్ర ప్రజలు విద్యుత్ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోలేదు. దీనికోసం ప్రభుత్వం, విద్యుత్‌సంస్థలు, విద్యుత్ ఉద్యోగులు నిరంతరం శ్రమించారు. ఈ క్రమంలో వాళ్లు ప్రాణాలను కూడా పణంగా పెట్టారనడంలో సందేహం లేదు.
భవిష్యత్తులో విద్యుత్ చార్జీలు పెరగకుండా అంతర్గత సామర్థ్యాన్ని పెంపొందించుకొని లాభాల దిశగా పయనించాల్సిన బాధ్యత విద్యుత్ సంస్థలు, ఉద్యోగులపైన ఉన్నది. సాంకేతిక, వాణిజ్య నష్టాలను తగ్గించుకొని లాభాలనిచ్చే వాణిజ్య, పారిశ్రామిక అమ్మకాలను పెంచుకోవడం ద్వారా సంస్థల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరుచుకోవడానికి గణనీయమైన అవకాశాలున్నాయి.
విద్యుత్ చార్జీల పెరుగుదలతో మన రాష్ట్రంలో వ్యవసాయరంగం మీద ఎలాంటి ప్రభావం ఉండదు. 24 గంటల ఉచిత విద్యుత్తు కూడా కొనసాగుతుంది. ఈ విషయాన్ని ఇలా ఉంచి.. మిగతా పెద్ద రాష్ర్టాల్లో విద్యుత్ వినియోగదారులు ఏ మేరకు చెల్లిస్తున్నారో పట్టికల్లో చూడవచ్చు.