వరంగల్ ఎంజీఎం హాస్పిటల్ ఐసీయూలో రోగిని ఎలుకలు కొరికేసిన ఘటనను రాష్టప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. హాస్పిటల్ సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందంటూ పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఎంజీఎం సూపరింటెండెంట్‌ను ప్రభుత్వం బదిలీ చేసింది. ఇప్పటికే ఈ ఘటనపై వైద్యారోగ్యశాఖ మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ఈ నేపథ్యంలో సూపరింటెండెంట్‌ను బదిలీ చేయడంతో పాటు మరో ఇద్దరు వైద్యులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. హాస్పిటల్ సూపరింటెండెంట్‌గా చంద్రశేఖర్‌కు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. వరంగల్ ఎంజీఎంలో శ్రీనివాస్ అనే రోగి కాలు, చేతి వేళ్లను ఎలుకలు కొరికేశాయి. దీంతో అతనికి తీవ్రంగా రక్తస్రావం జరిగి ఆయన పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఈ నేపథ్యంలో బాధ్యులపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది.