ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకోసం రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. 26 జిల్లాల ఏర్పాటుపై గతంలో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన వర్చువల్ కేబినెట్ మీటింగ్‌లో కొత్త జిల్లాల ఏర్పాటుకు ఆమోదముద్ర వేశారు.
కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 70 రెవెన్యూ డివిజన్లు ఉండనున్నాయి. వీటిలో కొత్తగా 22 రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు కానున్నాయి. స్థానికంగా ఉన్న ప్రజలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు ఇచ్చిన రిఫరెన్స్ ఆధారంగా కొత్త రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
ప్రతిపక్ష నేత చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు కేబినెట్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీంతో పాటు పలాస, బొబ్బిలి, చీపురుపల్లి, భీమిలి, భీమవరం, కొత్తపేట, ఉయ్యూరు, తిరువూరు, నందిగామ, బాపట్ల, సత్తెనపల్లి, చీరాల, ఆత్మకూరు, గుంతకల్లు, డోన్, ధర్మవరం, పుట్టపర్తి, రాయచోటి, పలమనేరు, నగరి, శ్రీకాళహస్తి, కుప్పం రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కొత్త జిల్లాల్లో ఏప్రిల్ 4న ఉదయం 9.05 నుంచి 9.45 గంటల మధ్య పాలనా వ్యవహారాలు ప్రారంభం కానున్నాయి.