దివంగత మాజీ ముఖ్యమంత్రి,తెలుగు సినిమా ఇండస్ట్రీకు చెందిన సీనియర్ నటుడు నందమూరి తారకరామారావు ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నారు. దాదాపు నాలుగు దశాబ్ధాలుగా ఇటు అప్పటి ఉమ్మడి ఏపీని అటు దేశాన్ని పాలిస్తున్న నిరంకుశ ధోరణికి వ్యతిరేకంగా హైదరాబాద్ మహానగరంలోని ప్రస్తుతం న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ సాక్షిగా తెలుగు దేశం పార్టీ పెట్టనున్నట్లు ప్రకటన చేశారు. తెలుగు వాడి ఆత్మగౌరవ నినాదంతో ఎన్టీఆర్ ప్రారంభించిన తెలుగుదేశం పార్టీ అప్పటివరకు ఉన్న రాజకీయాలకు కొత్త ఒరవడిని పరిచయం చేసింది.
తెలుగోడా తెలుగుదేశం పిలుస్తుంది రా కదిలి రా అని ఎన్టీఆర్ పిలుపునిస్తూ ప్రజలను రాజకీయ సభలకు తీసుకొచ్చే ఒరవడికి శుభం పలికి చైతన్య రథం అనే వాహనంపై ఆయనే ప్రజల వద్దకెళ్ళేవాడు. దీంతో జనాలు ఎన్టీఆర్ వెళ్లిన ప్రతిచోటకు తండోపతండాలుగా తరలివచ్చేవారు. ఆ విధంగా కొద్ది రోజుల్లోనే మహా ప్రభంజనంలా మారిన టీడీపీ ఆవిర్భవించిన తొమ్మిది నెలలకే జరిగిన అప్పటి ఉమ్మడి ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. అప్పటి వరకు అపజయమే ఎరుగని కాంగ్రెస్ పార్టీకి ఓటమి రుచిని చూపించింది టీడీపీ. అయితే అప్పుడు నెలకొన్న కొన్ని రాజకీయ పరిస్థితుల కారణంగా టీడీపీ అధికారంలోకి వచ్చిన కొన్ని నెలలకే ఆ పార్టీలో ఓ కుదుపు.
1984 ఆగస్ట్ సంక్షోభంలో ఎన్టీఆర్ ముఖ్యమంత్రి పదవీ నుండి దిగిపోవాల్సి వచ్చింది. హృద్రోగ సమస్యతో బాధపడుతున్న కానీ ఎన్టీఆర్ దాన్ని లెక్కచేయకుండా ప్రజాస్వామ్య ఉద్యమం పునరుద్ధరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నెల రోజుల పాటు జరిగిన ఆ ప్రజాఉద్యమానికి అప్పటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీ దిగిరాక తప్పలేదు. దీంతో మళ్లీ ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు.ఎన్టీఆర్ హాయాంలో 1983,1985,1989,1994లలో జరిగిన ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో మూడు సార్లు టీడీపీ ఘనవిజయం సాధించింది. అయితే టీడీపీ గెలిచిన మూడు సార్లు కూడా 200పైగా అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది. ఆ తర్వాత 1984,1991లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో సైతం టీడీపీ అత్యధిక ఎంపీ స్థానాలను దక్కించుకుంది.