తెలంగాణలోని దళితుల అభ్యున్నతి కోసం సీఎం కేసీఆర్ ప్రారంభించిన దళిత బంధు కేవలం కార్యక్రమమో, పథకమో కాదు, అదొక ఉద్యమం. దళితులకు డబ్బులు పంచడం మాత్రమే పరిష్కారం కాదు. సామాజిక అస్పృశ్యతను తొలగించాలనేది సీఎం కేసీఆర్ లక్ష్యమని వైద్య, అరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. ప్రభుత్వ దవాఖానల్లో 16% కాంట్రాక్టు ఏజెన్సీలను ఎస్సీలకు రిజర్వ్ చేసే ప్రక్రియను మంత్రి మంగళ వారం కోఠిలోని కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కార్యాలయంలో ప్రారంభించారు.TSMIDC చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, ఎండీ చంద్రశేఖర్ రెడ్డి, డీపీహెచ్ శ్రీనివాస్ రావు, డీఎంఈ రమేష్ రెడ్డి, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వాకాటి కరుణ, సీఎం ఓఎస్డీ గంగాధర్ తో కలిసి డ్రా ద్వారా హాస్పిటళ్లను ఎంపిక చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..దళిత బంధు లబ్ధిదారులు సరైన యూనిట్ ఎంపిక చేసుకునేలా..ఆ యూనిట్‌ను గ్రౌండ్ చేసేలా ఉన్నత అధికారులు, ప్రజా ప్రతినిధులు ఒక్కొక్కరు ఒక్కో లబ్ధిదారునికి మార్గనిర్దేశం చేస్తున్నారని తెలిపారు.
దళితులు కూలి పనులకు మాత్రమే పరిమితం కావొద్దని, ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు కాంట్రాక్టుల్లోనూ రిజర్వేషన్ కల్పించాలని స్వాతంత్ర్యానికి ముందే డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ బ్రిటిష్ ప్రభుత్వానికి లేఖ రాశారని గుర్తు చేశారు. నాడు అంబేద్కర్ కన్న కలలను నేడు సీఎం కేసీఆర్ నిజం చేశారు. గతంలో నీటిపారుదల శాఖలో జరిగే టెండర్లలో 21% ఎస్సీ, ఎస్టీలకు కేటాయిస్తూ జీవో 59 విడుదల చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీర్‌ది అన్నారు.
ఇప్పటికే వైన్ షాపుల్లో దళితులకు రిజర్వేషన్లు అమలవుతున్నాయి. 300కు పైగా షాపుల్లో గల్లాపెట్టె ల మీద దళితులు కూర్చున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ దవాఖానల్లో శానిటేషన్ & సెక్యూరిటీ, డైట్ ఏజెన్సీల్లో 16% దళితులకు కేటాయిస్తున్నామని పేర్కొన్నారు. వంద పడకల లోపు హాస్పిటల్‌ను ఒక కేటగిరిగా.. వంద పడకలకు పైగా ఉన్న హాస్పిటల్ ను మరో కేటగిరిగా విభజించాం. ఏయే హాస్పిటల్లను రిజర్వ్ చేయాలో డ్రా ద్వారా పారదర్శకంగా నిర్ణయిస్తామన్నారు. మొత్తం 56 హాస్పిటల్ లను దళితులకు కేటాయించామని వివరాలను వెల్లడించారు. వీటికి త్వరలో టెండర్లు పిలుస్తామన్నారు.