వచ్చే ఎన్నికల్లో యూత్‌కి 40 శాతం టికెట్లు కేటాయిస్తామని టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. టీడీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో నిర్వహించిన వేడుకల్లో ఆయన మాట్లాడారు. రెండు రాష్ట్రాల్లో టీడీపీని ప్రజలు సపోర్ట్ చేయాల్సిన అవసరముందన్నారు. యూత్ ఎక్కువగా రాజకీయాల్లోకి రావాలని.. వారంతా న్యాయం కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. రాజకీయాల్లో మార్పు తేవాలని భావిస్తున్నవారంతా రావాలని కోరారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన వ్యక్తి ఎన్టీఆర్ ని.. టీడీపీ అధికారంలో ఉన్నా లేకపోయినా ఎప్పుడూ ప్రజల పక్షానే ఉంటుందని చెప్పారు.
హైదరాబాద్ అభివృద్ధిలో తన శ్రమ ఉందని చంద్రబాబు అన్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టు ఏర్పాటు, ఔటర్ రింగ్ రోడ్డుకు శ్రీకారం చుట్టామని చెప్పారు. గతంలో తాను చేసిన అభివృద్ధి తాలూకా ఫలితాలు ఇప్పుడు కనిపిస్తున్నాయన్నారు. ఏపీ తెలంగాణను ఎప్పుడూ వేర్వేరుగా చూడలేదని చెప్పారు. హైదరాబాద్ మాదిరిగానే అమరావతిని అభివృద్ధి చేయాలనుకున్నానన్నారు. ఏపీని పునర్నిర్మాణం చేసుకోవాల్సిన బాధ్యత ప్రజలపైనే ఉందని చంద్రబాబు చెప్పారు.