నవ్య యాదాద్రిని ముఖ్యమంత్రి కేసీఆర్ జాతికి పునరంకితం చేశారు. జయజయ ధ్వానాల మధ్య ప్రధాన ఆలయ ప్రవేశం జరిగింది. మహాకుంభ సంప్రోక్షణ క్రతువు శాస్రోక్తంగా ముగిసింది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ దంపతులను వేద పండితులు ఆశీర్వదించి, తీర్థ ప్రసాదాలను అందజేశారు.
శోభాయాత్ర, విమాన గోపురాలకు పవిత్ర జలాలతో అభిషేకం, ఆలయ ప్రవేశం జరిగిన సమయంలో నమో నారసింహ మంత్రం ప్రతి ధ్వనించింది. ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులు, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, పలువురు ప్రముఖులు, ఆలయ అర్చకులు, అధికారులు పాల్గొన్నారు.
ఆలయ పునర్నిర్మాణంలో పాలు పంచుకున్న ఆలయ ఈవో ఎన్ గీత, ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి, స్థపతి సుందర్ రాజన్, వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్ రావును సీఎం కేసీఆర్ శాలువాలతో సత్కరించి, సన్మానించారు. ఆర్కిటెక్చర్ మధుసూదన్, ఈఎన్సీ రవీందర్ రావు, గణపతిరెడ్డి, శంకరయ్యలను మంత్రి ప్రశాంత్ రెడ్డి, జీ వసంత్ నాయక్, వై లింగారెడ్డి, వెంకటేశ్వర్ రెడ్డిలను మంత్రి జగదీశ్వర్ రెడ్డి, రామారావు, సుధాకర్ తేజలను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి శాలువాలతో సత్కరించి సన్మానించారు. అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఆలయ ఈవో గీత, వైటీడీఏ వైస్ చైర్మన్ శాలువాతో సత్కరించి, నారసింహ స్వామి ఫోటోను బహుకరించారు.