అనంతపురం జిల్లా టీడీపీలో విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి, పుట్టపర్తి టీడీపీ ఇన్‌ఛార్జ్, మాజీ మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి పరస్పరం చేసుకున్న కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి.
ఏం జరిగిందంటే..
ఓబులదేవర చెరువు మండలంలోని ఓ నేత గృహప్రవేశ కార్యక్రమానికి జేసీ ప్రభాకర్‌రెడ్డి వెళ్లారు. జేసీతో పాటు పుట్టపర్తి టీడీపీ నేత సాకెం శ్రీనివాసరెడ్డి కూడా ఉన్నారు. ఈ క్రమంలో ఓ యూట్యూబ్ ఛానల్‌తో జేసీ ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ అనంతపురం జిల్లాలో టీడీపీకి చెందిన 11 మంది మాజీ ఎమ్మెల్యేలు కూడా మరకలున్న నాయకులేనని.. వారందరినీ పార్టీ అధినేత చంద్రబాబు మార్చాలని వ్యాఖ్యానించారు. అదే సమయంలో పల్లె రఘునాథరెడ్డిపైనా కామెంట్ చేశారు. ఆయనకు టికెట్ ఇస్తే చంద్రబాబు సీఎం కాలేడని వ్యాఖ్యానించారు.
జేసీ ప్రభాకర్‌రెడ్డి కామెంట్స్‌పై పల్లె రఘునాథరెడ్డి కూడా ఫైర్ అయ్యారు. పుట్టపర్తిలో టీడీపీని వీక్ చేసేందుకు జేసీ ఆవిధంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. తాడిపత్రిలో టికెట్ వస్తుందో లేదో జేసీ ప్రభాకర్‌రెడ్డి చూసుకోవాలని కౌంటర్ ఇచ్చారు. తనకు ఇప్పటికే 6సార్లు బీఫాం అందిందని.. 7వ సారి కూడా తనకే వస్తుందని పల్లె రఘునాథరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటికే టీడీపీ పరిస్థితి అంతంతమాత్రంగా ఉన్న నేపథ్యంలో ఇద్దరు నేతలు ఇలా రోడ్డున పడి కామెంట్స్ చేసుకోవడంపై ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.