తెలంగాణ ప్రజలను అవమాన పరిచేరీతిలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడారని మంత్రి హరీష్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం కొనాలని తాము కోరుతుంటే.. నూకలు తినమని చెప్పడం తెలంగాణ ప్రజలను అవమానించడమేనన్నారు. సిద్దిపేట జిల్లా శ్రీగిరిపల్లిలో మంత్రి పర్యటించారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ పీయూష్ గోయల్ వ్యాఖ్యలపై మండిపడ్డారు.
నూకలు తినాలంటూ అవమాన పరిచిన ఢిల్లీ ప్రభుత్వానికి రాబోయే ఎన్నికల్లో నూకలు చెల్లేలా తీర్పు ఇవ్వాలని ప్రజల్ని హరీష్‌రావు కోరారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే 1.30లక్షల పోస్టులను భర్తీ చేసిందని.. త్వరలో మళ్లీ 90వేల పోస్టులకు నోటిఫికేషన్ ఇస్తుందన్నారు. దేశవ్యాప్తంగా ప్రభుత్వ శాఖల్లో 15లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని.. దమ్ముంటే వాటిని భర్తీ చేయాలని బీజేపీని ఉద్దేశించి అన్నారు. చేతనైతే పెంచిన ఇంధన, వంటగ్యాస్ ధరలను తగ్గించి బీజేపీ నేతలు మాట్లాడాలని హితవు హరీష్‌రావు పలికారు.