ఏపీ కేబినెట్ రీషఫిల్ ఎప్పుడనేదానిపై రాష్ట్ర రాజకీయాల్లో చర్చ జరుగుతోంది. ఇటీవల నిర్వహించిన వైఎస్సార్‌సీపీ ఎల్పీ మీటింగ్‌లో కేబినెట్ రీషఫిల్ త్వరలోనే ఉంటుందని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి క్లారిటీ ఇచ్చేశారు. ఈ నేపథ్యంలో మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ ఎప్పుడు ఉంటుంది.. కొత్త కేబినెట్‌లో ఎవరెవరు ఉంటారు అనేదానిపై రాజకీయవర్గాల్లో చర్చ అవుతోంది.
ఈనెల 30న కేబినెట్ రీషఫిల్ చేయాలని తొలుత సీఎం జగన్ భావించారు. అయితే ఉగాదికి ముందు అమావాస్య ఉండటంతో ఈనెల 30న ఇక వద్దని నిర్ణయించారు. అందుకే ఏప్రిల్ 11న మంచి రోజు అని.. అప్పుడు కేబినెట్ పునర్‌వ్యవస్థీకరణ చేయాలని సీఎంకు కొందరు సూచించినట్లు సమాచారం. అందుకే ఏప్రిల్ 11నే కేబినెట్ రీషఫిల్ జరిగే అవకాశముంది. అయితే దీనిపై సీఎంవో అధికారికంగా నిర్ణయాన్ని వెల్లడించాల్సి ఉంది.
మరోవైపు కొత్త మంత్రివర్గం ఏర్పాటుకు ముందే ప్రస్తుతం ఉన్న మంత్రులకు సీఎం జగన్ విందు ఏర్పాటు చేయనున్నారు. పార్టీలో నిర్వర్తించాల్సిన బాధ్యతలు.. ఎన్నికలకు సమాయత్తం అవ్వాల్సిన తీరును వారికి సీఎం వివరించనున్నట్లు తెలుస్తోంది. కేబినెట్ రీషఫిల్‌లో ఇద్దరు లేదా ముగ్గురు పాత మంత్రులే కొనసాగే అవకాశముంది. సమీకరణాలు కుదరకపోతే మొత్తం అందర్నీ మార్చేసి వారి స్థానంలో కొత్తవారిని ఎంపిక చేయనున్నట్లు సమాచారం. ఈసారి కేబినెట్‌లో స్థానంపై కొంతమంది ఎమ్మెల్సీలు కూడా ఆశలు పెట్టుకున్నారు.